తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్‌ను అందుకే గుర్తు చేయలేదట..?

 

అంతరించిపోతున్న తెలుగు భాషను కాపాడటంతో పాటు .. తెలుగు భాష, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం.. ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు గాను ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రధాన వేదికతో పాటు భాగ్యనగరంలో ఏ మూల చూసినా తెలుగు కవులు, కళాకారుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 42 దేశాల్లోని తెలుగువారిని.. పలు రాష్ట్రాల్లోని వారిని.. ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన తెలుగువారిని ఆహ్వానించి.. వారిని ఘనంగా సత్కరించి పంపారు. ఇందుకోసం రూ.60 కోట్లకు పైనే ఖర్చు చేశారు.  ఇంతా చేసి కేసీఆర్ విమర్శలు మూట గట్టుకున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి.. తెలుగు భాష అనేది ఒకటి ఉందని.. తెలుగువారు తలచుకుంటే ఏదైనా సాధించగలరని చేతల్లో చూపించిన.. తెలుగుతల్లి ముద్దుబిడ్డ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరు మచ్చుకైనా ఎక్కడా తలచుకోలేదు. అంతేనా..? సోదర తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాటవరసకు కూడా ఆహ్వానించకపోవడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

 

సోషల్ మీడియాలో అయితే కేసీఆర్‌ గారిపై ఏ రేంజ్‌లో కామెంట్లు పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతమంది ఏమనుకున్నా.. లెక్క చేయని మనస్తత్వం కేసీఆర్‌ది.. ఆయన ఒకదానికి కమిట్ అయితే ఆరు నూరైనా వెనక్కు తగ్గరు.. తెలుగు మహాసభల విషయంలోనూ ఇదే జరిగింది. ఐదు రోజుల పాటు వేడుకలు నిర్వహించారు.. ముగింపు వేడుకలకు రాష్ట్రపతిని పిలిచారు.. ప్రతి ఏడాది తెలుగు పండుగ చేసుకుందామని ఒక పద్యంతో వేడుకలకు వీడ్కోలు పలికారు కేసీఆర్. అయితే ఇన్ని రోజుల తర్వాత తెలుగు మహాసభల వేళ ఎన్టీఆర్‌‌ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదో ఇప్పుడు తీరిగ్గా వివరణ ఇచ్చారు తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి. తెలుగు మహాసభలు భాషకు, సాహిత్యానికి సంబంధించినవి.. ఇవి రాజకీయ సభలు అయితే, ఎన్టీఆర్‌ని తప్పకుండా గుర్తుచేసుకుంటాం. ఎందుకంటే రామారావు రచయిత కాదు. సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి అంతవరకే తప్ప.. ఇక్కడ  ఎన్టీఆర్‌లు, ఏఎన్నార్‌లు ఉండరు అంటూ తనదైన స్టైల్లో ఘాటుగా సమాధానమిచ్చారు సిధారెడ్డి.