టీ మంత్రులు.. ఇరుక్కుపోయారు..

 

తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోవడం అంటే ఏ స్కాములోనో కాదు.. లిఫ్ట్‌లో. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత ఇద్దరు మంత్రులూ లిఫ్ట్ ఎక్కారు. అయితే ఆ లిఫ్ట్‌కి వీళ్ళిద్దరూ మంత్రులని తెలియపోవడం వల్ల మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఇద్దరూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దాంతో భద్రతా సిబ్బంది, ఆస్పత్రి వర్గాలు కంగారుపడిపోయారు. హడావిడిగా లిఫ్ట్ తలుపులు తెరవాలని ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. 20 నిమిషాలపాటు తంటాలు పడిన అనంతరం మంత్రులిద్దరూ లిఫ్టులోంచి బయటపడ్డారు. లిఫ్ట్‌లోంచి బయటపడిన తర్వాత లిఫ్ట్ బాగుపడింది. లిఫ్ట్ ఇప్పుడు ఓకే అయింది సార్లూ.. దీన్ని ఎక్కే కిందకి వెళ్ళండని అక్కడున్నవారు చెప్పినా ఎందుకొచ్చిన తంటా అని మంత్రులు ఇద్దరూ మెట్ల మీద నుంచి నడుచుకుంటూ కిందకి దిగారు.