టీఆర్ఎస్ సర్కార్ సంచలన నిర్ణయం.. రైతుబంధు పథకానికి కోత!!

 

తెలంగాణలో రైతుబంధు పథకానికి సంబంధించి కోత పెడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రైతుబంధు పథకానికి పది ఎకరాల సీలింగ్ పెట్టటం ద్వారా.. ఖర్చును కాస్త తగ్గించుకోవచ్చన్న ఆలోచనలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.

2018లో రైతుబంధు పథకం ప్రారంభించినపుడు సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇచ్చారు. 2019లో దాన్ని రూ.5 వేలకు పెంచారు. అంటే.. ఖరీఫ్‌, రబీకి కలిపి ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాల్సి వస్తోంది. రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించటం ద్వారా.. వ్యవసాయం చేసే రైతు సమస్యలకు అసరాగా ఉండేలా ఈ పథకాన్ని ప్లాన్ చేశారు. అయితే ఎంత భూమి అంటే అంత మొత్తానికి పథకాన్ని అమలయ్యేలా చేశారు. ఈ పథకం బడ్జెట్ భారీగా ఉండటంతో ఇతర సంక్షేమ పథకాలకు.. ఇతరత్రా పథకాలకు నిధుల సమస్య ఇబ్బందిగా మారింది. 

ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.14,500 కోట్లు రైతుబంధుకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు సమకూర్చాల్సి ఉంది. దాంతో రైతుబంధు పథకానికి కోత పెట్టి, కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దాంతో రైతుబంధుకు సీజన్‌కు రూ.50 వేల గరిష్ఠ పరిమితితో అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఫైలు సీఎం కేసీఆర్‌ వరకు వెళ్లిందని, ఆయన ఆమోదిస్తే రబీ నుంచే కోత అమల్లోకి వస్తుందని అంటున్నారు. అయితే సీఎం ఇందులో మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు.
 
అధికారుల ప్రతిపాదనల ప్రకారం రైతుకు 10 ఎకరాలకు మించి భూమి ఉన్నా.. 10 ఎకరాలకు మాత్రమే లబ్ధి కలుగుతుంది. పదెకరాలకు మించిన భూమి లక్షా రెండు వేల మంది రైతులకు ఉన్నట్లు సమాచారం. వారిచేతిలో 15.25 లక్షల ఎకరాల భూమి ఉంది. అంటే, దాదాపు ఐదు లక్షల ఎకరాల భూమికి ఇవ్వాల్సిన రూ.500 కోట్ల రైతు బంధు సాయం మిగులుతుందన్నమాట. తాజా నిర్ణయం ప్రభుత్వానికి అంతో ఇంతో ఉపశమనం కలిగేలా చేస్తుందంటున్నారు. మరి ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.