జి.హెచ్.ఎం.సి.కమీషనర్ సోమేశ్ కుమార్ బదిలీ!

 

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ 22 మంది ఐ.ఏ.ఎస్‌. అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసారు. నిన్న బదిలీ అయిన వారిలో జీ.హెచ్‌.ఎం.సీ. కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌, జి.హెచ్.ఎం.సి. స్పెషల్‌ కమిషనర్లు నవీన్‌ మిట్టల్‌, జి.కిషన్‌ లు కూడా ఉన్నారు. జి.హెచ్.ఎం.సి. పరిధిలో ఓటర్ల జాబితా సవరణ పేరిట 6,32,000 మంది ఆంధ్రా ఓటర్ల పేర్లను తొలగించడంతో కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేసేందుకు డిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌ సీఈవో సునీల్‌ గుప్తా నేతృత్వంలో 14 మంది అధికారులను హైదరాబాద్ కు పంపింది. వారు నిన్న క్షేత్రస్థాయిలో జరిపిన విచారణలో ఓటర్ల జాబితా సవరణలో చాలా అవకతవకలు జరిగినట్లు ప్రాధమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో జీ.హెచ్‌.ఎం.సీ. కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌, జి.హెచ్.ఎం.సి. స్పెషల్‌ కమిషనర్లు నవీన్‌ మిట్టల్‌, జి.కిషన్‌ లను నిన్న రాత్రే బదిలీ చేయడం గమనార్హం. సోమేశ్ కుమార్ ని గిరిజన సంక్షేమ శాఖకు ముఖ్య కార్యదర్శిగా నియమించింది.