రాజ్‌భవన్ కు తెలంగాణ బిల్లు?

 

 

 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుట్టిన రోజునే తెలంగాణ బిల్లుకు 'లైన్ క్లియర్' చేసినట్లు ఢిల్లీలోని విశ్వనీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై అభిప్రాయం చెప్పేందుకు శాసనసభకు ఆరు వారాలు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రే బిల్లు గవర్నర్ కార్యాలయానికి చేరినట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతుండగా... అందుకు సరిగ్గా ఒక్కరోజు ముందు ముసాయిదా బిల్లు రాజ్‌భవన్ చేరినట్లు తెలియడం గమనార్హం. విభజన ముసాయిదా బిల్లును కేంద్రమంత్రివర్గం ఈనెల 5న ఆమోదించింది. ఆ మరుసటి రోజే దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు.



దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా సంతాప సభలో పాల్గొనేందుకు మంగళవారం దక్షిణాఫ్రికా వెళ్లిన రాష్ట్రపతి... బుధవారం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. ఆ వెంటనే బిల్లు ముసాయిదాను 'క్లియర్' చేసినట్లు తెలిసింది. అయితే, తమకు రాష్ట్రపతి నుంచి ముసాయిదా బిల్లు అందలేదని హైదరాబాద్‌లోని అధికార వర్గాలు చెబుతున్నాయి. బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా దీనిపై ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశాయి. గురువారం ఈ అంశంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు... రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లులోని వివిధ అంశాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ నిపుణులతో నిశితంగా చర్చించినట్లు తెలిసింది. తన కార్యాలయం నుంచి అసెంబ్లీకి వెళ్లే బిల్లు పూర్తిస్థాయిలో పక్కాగా ఉండాలని, అందులో ఎలాంటి న్యాయపరమైన లొసుగులు, ఇబ్బందులు ఉండరాదనే భావనతో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు.