ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు..కారణం అదేనా...

 

టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటనకు ముహూర్తం కుదరడం లేదు. మండలి రద్దుపై కౌంటర్ యాత్రకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రపతి మొదలుకుని కేంద్ర మంత్రులను కలవాలనుకున్న ఎమ్మెల్సీలకు అపాయింట్ మెంట్ లు దొరకటం లేదు. శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి శాసన మండలి రద్దుపైన చర్చించారు. రాజకీయ కారణాలతో మండలిని సీఎం జగన్ రద్దు చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్రం పెద్దల దృష్టికి తీసుకు వెళ్లాలని టిడిపి ఎమ్మెల్సీలు నిర్ణయించారు. ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులను కలిసి మండలి రద్దుకు దారి తీసిన పరిస్థితులను వివరించాలని నిర్ణయించారు.

టిడిపి నేతలు ఢిల్లీ వెళ్లాలనుకుని వారం గడుస్తున్నా ఇప్పటికీ టూర్ మాత్రం షెడ్యూల్ కాలేదు. ఢిల్లీ పెద్దలను కలవాలని పెద్ద లిస్టునే టిడిపి ఎమ్మెల్సీలు సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు అపాయింట్ మెంట్ లు ఖరారు కాలేదు. ఉప రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారు అయినప్పటికీ ఇతర నేతల టైమ్ దొరకలేదు. దీనికోసం ఢిల్లీలో ఎంపీలు ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికీ ముఖ్య నేతల అప్పాయింట్ మెంట్ దొరకలేదని సమాచారం. దీంతో కేవలం ఉపరాష్ట్రపతిని కలిసి వస్తే సమంజసం కాదని భావిస్తున్న టిడిపి ఎమ్మెల్సీలు ఇతర నేతల టైమ్ కూడా దొరికిన తరువాతే హస్తిన బాట పట్టాలని చూస్తున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టూర్ దెబ్బకు కూడా ఎమ్మెల్సీలకు మంత్రుల అపాయింట్ మెంట్ లు దొరకటం లేదని తెలుస్తోంది. కేంద్రం పెద్దలు అంతా ఇప్పుడు ట్రంప్ టూర్ హడావుడిలో ఉన్నారు. మరో నాలుగు రోజుల్లో ట్రంప్ టూర్ ఉంది కాబట్టి అది పూర్తయిన తర్వాతే ఢిల్లీ వెళితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. కేంద్ర మంత్రులను రాష్ట్రం నుంచి వెళ్ళిన ప్రతినిధులను కలవడం పెద్ద కష్టం కాదు. ఢిల్లీలోని ఎంపీలు ఆ మేరకు వారి టైమ్ తీసుకోవచ్చు, అయితే ప్రధాని టైమ్ దొరకడం మాత్రం అంత సులభం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు ప్రధాని టైమ్ కాదు గదా కేంద్ర మంత్రులను కలవడం కూడా కుదరదని టిడిపి నేతలే చెబుతున్నారు. హడావుడిగా టూరు ముగించుకు వచ్చినట్లుగా కాకుండా అందరినీ కలిసి తమ వాణిని గట్టిగా వినిపించాలని అనుకుంటున్నారు నేతలు. అందుకే కొంత ఆలస్యమైనా పర్లేదని ఢిల్లీ ప్రయాణాన్ని ఎమ్మెల్సీలు వాయిదా వేసుకున్నారని సమాచారం.