టీడీపీ-జనసేన కలిస్తే క్లీన్ స్వీపే..!

 

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు.. రాబోయే 20019 ఎన్నికల భవిష్యత్తును చూపించబోతున్నాయా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయ పరంపర కొనసాగిస్తుంది. అలాగే రాష్ట్రపతి అభ్యర్ధిగా కూడా తమ అభ్యర్ధిని గెలిపించుకోవాలని చూస్తుంది. అయితే కాంగ్రెస్, శివసేన పార్టీలు కొంత వ్యతిరేకత చూపించినా... చాలా రాష్ట్రాలే కమలం ఖాతాలో ఉన్నాయి.. యూపీ మొదలు మణిపూర్ వరకూ చాలా రాష్ట్రాలు బీజేపీ చేతిలో వున్నాయి. వాటితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చేతిలో వున్న రాష్ట్రాలు కూడా బీజేపీ ఖాతాలోకే వెళతాయి కాబట్టి ఎన్నికకు పెద్ద ఇబ్బంది లేదు.

 

అయితే ఏపీలో బీజేపీ, టీడీపీ పార్టీలు మిత్రపక్షం కాబట్టి ఎలాగూ మద్దతు ఉంటుంది. ఇక టీడీపీతో ఎప్పుడూ  ఉప్పు, నిప్పులా వుండే  వైసీపీ కూడా బీజేపీ కి సపోర్ట్ ఇచ్చింది. మోడీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ తమ సపోర్ట్ బీజేపీకే ఉంటుందని చెప్పడంతో అందరూ అశ్చర్యపోయారు. అంతేనా ఆ ఒక్క మాటతో ఆగకుండా రాష్ట్రపతి ఎన్నికకు ఎవరైనా పోటీ పెట్టాలంటే అది తప్పు, ఎన్డీఏ వద్ద తగినంత సంఖ్యాబలం ఉందని, వాళ్లే గెలుస్తారని,  ఎలాగు ఓడిపోతామన్నప్పుడు పోటీ పెట్టడం మంచిది కాదని బీజేపీకి కాస్త బటర్ కూడా పూశారు. అంతేకాదు భేటీ ముగిసిన అనంతరం ఏదో సాధించేసినట్టు.. భేటీ చాలా అద్బుతంగా జరిగిందని.. చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చారు.

 

దీంతో జగన్ అక్కడ చేసిన వ్యాఖ్యలు మరిచిపోయి ఉంటారేమో కానీ.. ఇక్కడే అసలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అదేంటంటే..రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ  చేతులు కలుపుతాయా అని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. జగన్ పైన వున్న కేసులు, జైలుకు వెళ్లాల్సి వచ్చే గండం ఆయన్ని మోదీతో రాజీకి తీసుకొచ్చాయంటున్నారు విశ్లేషకులు.  అంతే కాక, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎన్డీఏలో చేరి ఏపీలో అధికారం చేపట్టాలని జగన్ భావిస్తున్నారట, ఈ నేపథ్యంలోనే  జగన్ బీజేపితో పొత్తుకి తహతహలాడుతున్నారని టాక్. మరి జగన్ లాభం కోసం బీజేపీకి మద్దతు పలికినా..బీజేపీ జగన్ తో చేతులు కలుపుతుందా అని మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ఎన్డీఏలో టీడీపి ఎంతో కీలకం. అలాంటిది టీడీపిని కాదని మోదీ జగన్ ను చేరదీస్తారా? వైసీపీతో పొసుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో అప్పుడే తెరపైకి వస్తున్నాయి.

 

ఇంకా అసక్తికరమైన విషయం ఎంటంటే.. ఒకవేళ బీజేపీకి టీడీపీకి కనుక చెడిపోయి.. విడిపోతే.. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటుందని.. అదే కనుక జరిగితే 2019 ఎన్నికల్లో టీడీపీ-జనసేన క్లీన్ స్వీప్ చేయడం ఖచ్చితం అని నిఘా వర్గాలు అప్పుడే బీజేపీకి ఓ నివేదికను కూడా అందించాయట. మరి ఇన్ని క్యాలిక్లేషన్స్ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది...? టీడీపీని కాదని వైసీపీతో చేతులు కలుపుతుందా..? లేక జగన్ ప్లాన్ తెలిసి లైట్ తీసుకుంటుందా..? ఇవన్నీ తెలియాలంటే రాబోయే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.