నిధులు లేని నిరుపేద టీడీపీ!

ఎన్నికల నిధులు ఇంకా సర్దుబాటు చేయలేదట

 

అటకెక్కిన మీడియా బకాయిలు

 

అప్పుల్లో కూరుకున్న అభ్యర్ధులు

 

అభ్యర్ధుల చుట్టూ తిరుగుతున్న అప్పులోళ్లు

 

తెలుగుదేశం.. 17 నెలల క్రితం వరకూ, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ. కార్పొరేట్‌కు చొక్కా ఫ్యాంటూ వేస్తే దాని పేరే తెలుగుదేశం. కార్పొరేట్లు, రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐ దాతల జాబితాకు, వదాన్యుల ప్రవాహానికీ లెక్కలేదు. పార్టీని సొంతం చేసుకునే ఆసాముల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. పార్టీకి కష్టం వస్తే దన్నుగా నిలిచే పారిశ్రామికవేత్తలు బోలెడు. ఇన్ని అర్హతలతో అలరారుతున్న తెలుగుదేశం పార్టీ,  ఇప్పుడు నయాపైసా నిధులు లేని నిరుపేద. ఇది నిజంగా నిఝం! కావాలంటే మీరే చూడండి..

 

భారత రాజకీయాల్లో, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన తెలుగుదేశం పార్టీకి దేశ విదేశాల్లో లక్షల సంఖ్యలోనే అభిమానులున్నారు. వారిలో పారిశ్రామికవేత్తలతోపాటు, నిధులిచ్చి ఆదుకునే ఇన్‌ఫ్రా కంపెనీలు, వ్యక్తులు-శక్తులు బోలెడుమంది. వీరిలో కులాభిమానంతో నిధులు ఇచ్చే వ్యక్తులు, నిధులు సేకరించే శక్తుల జాబితా వేరు. అందుకే టీడీపీ ఇన్నేళ్లు రాజకీయాల్లో ధైర్యంగా నిలబడింది. దేశంలోనే కార్యకర్తలను ఆదుకునే ఏకైక పార్టీగా,  టీడీపీ మొన్నటి వరకూ అగ్రస్థానంలో నిలిచింది. అధికారం లేకపోయినా, రోజుకు కనీసం 50 మంది బాధితులకు వివిధ రూపాల్లో సాయం చేసిన ఘనత దానిది. వందలమంది రోగులకు  ఆసుపత్రులలో ఉచితంగా వైద్యఖర్చులను భరించారు. ఎన్టీఆర్ ట్రస్టు నుంచి వేలమంది లబ్థి పొందిన రోజులున్నాయి.

 

అధినేత చంద్రబాబు నాయుడు గురించి బయట ఎన్ని ప్రచారాలున్నప్పటికీ.. తన వద్దకు వచ్చిన వారికి లేదనకుండా సాయం చేయడంలో,  వైఎస్ కంటే ముందే ఉంటారన్నది నిజం. కానీ,  దురదృష్టవశాత్తూ ఆ విషయంలో ఏ కారణం వల్లనో, వైఎస్ పేరు ఒక్కటే ఇప్పటికీ ప్రచారంలో ఉంది. పార్టీ కార్యక్రమాలు కూడా నాణ్యత తగ్గకుండా.. అవసరాన్ని మించి ఖర్చు చేయడానికి, బాబు వెనుకంజ వేసిన సందర్భాలు లేవు.

 

ఎన్నికల్లో అభ్యర్ధులకు టీడీపీ ఇచ్చే ఆర్ధిక దన్ను, మరే పార్టీ ఇవ్వదు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో.. కాంగ్రెస్ కంటే, టీడీపీనే ఆర్ధికంగా దూసుకుపోయింది. దాన్ని చూసి కలవరపడిన వైఎస్, రెండో దశ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ.. చంద్రబాబు నాయుడు స్వయంగా ఆర్ధిక వ్యవహారాలు పర్యవేక్షించి, సొంతంగా తీసుకున్న నిర్ణయాలు. కానీ ఇప్పుడు ఆ అజమాయిషీ ఆయన చేయడం లేదని, ఈ పరిస్థితికి అదే కారణమన్నది తమ్ముళ్ల మాట. ఆర్ధిక అంశాల్లో.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీనే దశాబ్దాలపాటు ఖఃగుతినిపించిన టీడీపీ,   ఇప్పుడు ఇలా కడు నిరుపేదగా మారిందట.

 

గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులకు.. వివిధ కారణాల వల్ల ఆలస్యంగా నిధులు వెళ్లినా, అవి తగినంత ఇవ్వలేదట. అటు వైసీపీ నాయకత్వం, నెల ముందుగానే అభ్యర్ధులకు నిధులు సర్దుబాటు చేసింది. ఎంపీ అభ్యర్ధులు కూడా 15 కోట్లు అసెంబ్లీ అభ్యర్ధులకు ఇచ్చారు, దానితో ఒక్కో వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధి,  25 కోట్లకు తగ్గకుండా ఖర్చు చేశారన్నది ఒక అంచనా. మరోవైపు టీడీపీకి ఆర్ధికంగా దన్నుగా నిలిచే వర్గాలపై ఐటి, ఈడీలు మెరుపుదాడులు చేసి, పార్టీ ఆర్ధికమూలాలు దెబ్బతీసింది. ఆ సమయంలో నిధులు సర్దుబాటు కాక, టీడీపీ నాయకత్వం చేతులెత్తేసింది.

 

అయినా..  స్ధానికంగా మీరు సర్దుబాటు చేసుకుంటే, ఎన్నికల తర్వాత ఇస్తామన్న హామీతో టీడీపీ అభ్యర్ధులు,  అప్పులు చేసి ఎన్నికలు పూర్తి చేశారు. కానీ పార్టీ ఓడిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకూ, ఎన్నికల అప్పుపై హామీ ఇచ్చిన వారెవరూ స్పందించడం లేదట. అసెంబ్లీకి పోటీ చేసి అప్పులపాలయిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.. ఈ బాధ పడలేక, వారిని నేరుగా నాయకత్వం వద్దకే తీసుకువెళ్లారట. అప్పులవాళ్లకు ఏదో ఒక హామీ ఇచ్చి,  తనను గండం నుంచి గట్టెక్కించమని వేడుకున్నా ఎవరూ స్పందించలేదట.

 

ఇటు చూస్తే.. ఎన్నికల సమయంలో వాడిన  మైకులు, షామియానాలు, కుర్చీలు, క్యాటరింగు, ట్రావెల్స్, స్థానికంగా పత్రికలకు ఇచ్చిన ప్రకటన  తాలూకు బకాయిలివ్వమని రోజూ ఇంటి చుట్టూ తిరుగుతుండటం, అభ్యర్ధులకు పరువు తక్కువ వ్యవహారంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేగా ఉంటూ, హటాత్తుగా ఎంపీ అభ్యర్ధి అవతారమెత్తిన  ఓ రాజు గారు.. తన జమానాలో ఊరంతా అప్పులు చేసి, హైదరాబాద్ చెక్కేశారట. అప్పులవాళ్లు ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం. ఇలాంటి అభ్యర్ధులు చాలామంద ఉన్నారట. అదొక విషాదం!

 

ఇక గత ఎన్నికల ముందు టీడీపీ.. పత్రికలు- చానెళ్లకు ఇచ్చిన ప్రకటనల బకాయిలు కూడా ఇప్పటికీ చెల్లించలేదు. అవి కూడా కోట్ల రూపాయల పైమాటేనంటున్నారు. ఫలితాల నుంచి ఇప్పటివరకూ బకాయిల కోసం,  పార్టీ చుట్టూ తిరుగుతున్న పత్రికా ప్రతినిధులకు.. చెప్పులు అరిగిపోవడం తప్ప, ఇప్పటివరకూ స్పందించిన వారు లేరు. దీనితో ప్రధానంగా చిన్న పత్రికలు విలవిల్లాడుతున్నాయి. బకాయిలపై ఎవరూ నోరెత్తకపోవడంతో ఆ బకాయిలు ఎప్పుడిస్తారో? ఎవరిస్తారో తెలియక తలపట్టుకుంటున్న పరిస్థితి. చివరకు అసెంబ్లీ అభ్యర్ధులు కూడా బకాయిలు ఎగొట్టి, తప్పించుకు తిరుగుతుంటే యాజమాన్యాలకు జవాబు చెప్పలేక స్థానిక విలేకరులు సతమతమవుతున్నారట. ఇదీ.. నిధులు లేక నిరుపేదగా మారిన  తెలుగుదేశం పార్టీ ఆర్ధిక దుస్థితి.

-మార్తి సుబ్రహ్మణ్యం