పొత్తు పెట్టుకుందాం.. ప్లీజ్

 

ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది టీడీపీ - బీజేపీ పొత్తుల వ్యవహారం. టీడీపీతో తమకు పొత్తు ఉండబోదని బీజేపీ తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టేసినా, ఇంకా ఆ వ్యవహారం ముగిసిపోలేదని, కొనసాగుతోందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. పొత్తుల విషయమై పైకి ఏమీ మాట్లాడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ జాతీయనేతలతో తన మంతనాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక్కడి నాయకులు తమ బలమేంటో తెలుసుకోకుండా ఎక్కువ సీట్లు అడుగుతున్నారని, అయినా తాము కూడా పట్టు విడుపులకు సిద్ధమేనంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీలకు బాబు ఫోన్ చేశారు. ఒంటరి పోరాటంపై తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కోరుతూ పొత్తుపై చర్చలు జరిపినట్లు సమాచారం.

 

సోమవారం ఢిల్లీలో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో పొత్తుపై చర్చించి స్పష్టమైన ప్రకటన చేస్తామని రాజ్‌ నాథ్ బదులిచ్చినట్లు తెలిసింది. తర్వాత బీజేపీ అగ్రనేతలు ఇద్దరూ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత వెంకయ్యనాయుడుకు ఫోన్ చేసి.. టీడీపీతో పొత్తుపై పట్టు విడుపులు ఉండేలా చూడాలని సూచించినట్లు తెలిసింది. పొత్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ, సీమాంధ్ర బీజేపీ శాఖలు రెండూ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. పొత్తులో భాగంగా తెలంగాణలో 40 అసెంబ్లీ సీట్లు, హైదరాబాద్‌తో పాటు 8 పార్లమెంటు సీట్లు బీజేపీకి ఇవ్వటానికి అభ్యంతరం లేదని చివరిమాటగా చెప్పానని చంద్రబాబు వెల్లడించారని అంటున్నారు. ఇంతకు మించి వారికి సీట్లు ఇవ్వడం కుదరదని, ఆయా సీట్లలో టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని బాబు సూచించినట్లు సమాచారం. సీమాంధ్రలో 10 అసెంబ్లీ, మూడు లోక్‌సభ సీట్లతోనే సరిపుచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.