సిరియా… ముందు అమెరికా నుయ్యి… వెనుక రష్యా గొయ్యి!

పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటారు! కాని, తాజాగా సిరియాలో జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే రెండు పిల్లుల చెలగాటం… ఒక ఎలుకకి ప్రాణ సంకటంగా మారిపోయింది! ఇంతకీ ఆ పిల్లులు ఎవరనా మీ అనుమానం? ఇంకెవరు, అమెరికా, రష్యా! ఒకప్పుడు వాల్డ్ వార్ తరువాత కోల్డ్ వార్ అంటూ నానా అరాచకం చేసిన రెండు సూపర్ పవర్స్ ఇప్పుడు మళ్లీ పవర్ ప్లే మొదలు పెట్టాయి! అదీ అంతర్యుద్ధంతో అతలాకుతలం అయిన సిరియాను అడ్డు పెట్టుకుని!

 

మధ్య ప్రాచ్యంలో ఈ మధ్య కాలంలో ఏదన్నా దేశం సర్వ నాశనమైందంటే అది సిరియానే! ఇరాక్ , లిబియా లాంటి దేశాలు కూడా సతమతం అవుతున్నా సిరియాది దయనీయ పరిస్థితి. ఒక వైపు మత ఛాందసవాదం, మరో వైపు ఐసిస్ లాంటి ఉగ్ర మూక చేస్తున్న ఘోరాలు, వాటికి తోడుగా సిరియాను ఏలుతున్న నియంత అసాద్ ఉన్మాద చర్యలు! అన్నీ కలిసి లక్షలాది మంది సిరియన్లు శరణార్థులుగా యూరప్ బాట పట్టేలా చేస్తున్నాయి!

 

సిరియాలో తాజాగా రసాయనిక దాడి జరిగింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్న పిల్లలు మరీ ఎక్కువ మంది మరణించారు. కారణం ఎవరో ఉగ్రవాదులు కాదు! సిరియాను గుప్పిట్లో పెట్టుకున్న ఆ దేశ నియంత అసాదే! ఆయన అజ్ఞల మేరకే రెబెల్స్ నియంత్రణలో వున్న ప్రాంతంపై రసాయనిక దాడి జరిగిందని అందరికీ తెలిసిందే! వెంటనే, ఆగ్రహానికి గురైన అమెరికా ఇప్పుడు మిసైల్ దాడులు మొదలు పెట్టింది! ట్రంప్ తాను సిరియా సమస్యను దాడులతో పరిష్కరిస్తానని చెప్పలేదు. అయినా కూడా అమెరికన్ ప్రెసిడెంట్ కి సిరియా నియంతపై కన్నెర్ర చేయక తప్పలేదు!

 

సిరియాపై అమెరికా దాడి మిగతా మిడిల్ ఈస్ట్ దేశాల పై యుద్ధం లాంటి వ్యవహారం కాదు. ఎందుకంటే, ఇక్కడ రష్యా కూడా రంగంలో వుంది. పుతిన్ సిరియాలోని అసాద్ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థిస్తున్నాడు. అందుకు ఆయన చెప్పే కారణం… సిరియా కనీసం నియంత ఆధీనంలోనన్నా లేకపోతే… ఐసిస్ లాంటి ఉగ్రమూకకు వశమైపోతుంది. అప్పుడు సిరియన్ల పరిస్థితి మరీ దారుణంగా వుంటుంది. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల మాట పక్కన పెడితే ప్రాణ, మానాలకి కూడా కనీస రక్షణ వుండదు. అందుకే, అసాద్ ప్రభుత్వాన్ని రష్యా సమర్థిస్తోంది. అంతే కాదు, ఆ నెపంతో అమెరికాకు మధ్య ప్రాచ్యంలో చెక్ పెడుతోంది కూడా!

 

అమెరికా , రష్యాల మధ్య నలిగిపోతున్న సిరియాకు ట్రంప్ రావటం కొంత మేలు చేస్తుందనుకున్నారు అంతా! ఆయనకు, పుతిన్ కు మంచి రిలేషన్స్ వున్నాయి కాబట్టి అగ్ర రాజ్యం ఇక సిరియా వ్యవహారంలో వేలు పెట్టదనుకున్నారు. కాని, అత్యంత పాశవికంగా రసాయనిక దాడులు జరగటంతో ట్రంప్ తన సైన్యాన్ని పంపి బలప్రయోగం చేయక తప్పలేదు. ఈ పరిణామం రష్యాకి నచ్చకపోవచ్చు. తన గుప్పిట్లో వున్న సిరియా అమెరికా దాడులకి గురి కావటం పుతిన్ ఒప్పుకోకపోవచ్చు! ఇది ముందు ముందు అమెరికా, రష్యాల మధ్య పంతంగా, పందెంగా కూడా మారే అవకాశం వుంది! అలా ఏం జరిగినా… నష్టపోయేది అమెరికా కాదు! రష్యా కూడా కాదు! సిరియానే మరింత చితికిపోతుంది! చితికిపోక తప్పదు కూడా!