ఎవరీ సుబ్రమణ్య స్వామి?
posted on Apr 29, 2016 10:51AM
సుబ్రమణ్య స్వామి పేరు దేశానికి కొత్తేమీ కాదు. కాంగ్రెస్‌కు అసలే కాదు. నెహ్రూ కుటుంబం అంటేనే మండిపడిపోయే ఈ మాటల మాంత్రికుడిని మోదీ ఏరికోరి రాజ్యసభకు పంపారన్న విశ్లేషణలు వినవచ్చాయి. అందుకు అనుగుణంగానే సభలో ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే స్వామి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టడం మొదలుపెట్టారు. అసలు ఇంతకీ ఈ సుబ్రమణ్య స్వామి ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? నెహ్రూ కుటుంబం మీద ఆయనకు ఎందుకంత కక్ష? లాంటి ప్రశ్నలకు లభించే జవాబులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి!
సుబ్రమణ్య స్వామి దూకుడు చూసి ఆయన ఇంకా 50 ఏళ్ల వయస్కుడే అనిపిస్తుంది. కానీ ఆయన వయసు 76! చెన్నైలోని ఓ తమిళ బ్రాహ్మణుల ఇంట స్వామి పుట్టారు. తండ్రి ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌లో ఉన్నతాధికారి కావడంతో వాళ్ల ఇంటికి తరచూ నేతల రాకపోకలు ఉండేవి. దాంతో స్వామికి చిన్నప్పటి నుంచే రాజకీయాల మీద కొంతమేరకు అవగాహన ఉంది. చదువుకి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చే నేపథ్యం ఉండటంతో దిల్లీ, కోల్‌కతాల్లో ఉన్నత చదువులను పూర్తిచేసి ఆర్థికశాస్త్రంలో పీ.హెచ్.డీ కోసం ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. పీ.హెచ్.డీ పట్టాను సాధించాక, అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేయడం మొదలుపెట్టారు. అక్కడే ఆయన జీవితం సాగిపోయి ఉంటే ఏమయ్యేదో కానీ... భారతదేశానికి వస్తే మంచి ఉద్యోగాలు ఇస్తామంటూ ఇక్కడి నుంచి ప్రతిపాదనలు వెళ్లడం మొదలయ్యాయి. ఆ ఉద్యోగాలను స్వీకరించేందుకు భారతదేశానికి తిరిగివచ్చిన స్వామికి అప్పటి ప్రధాని ఇందిరతో మనస్పర్థలు మొదలయ్యాయి.
సుబ్రమణ్య స్వామి స్వాచ్ఛా విపణికి (ఓపెన్ మార్కెట్) అనుకూలం. ఇందిరాగాంధీ అందుకు విరుద్ధమైన సమాజవాదాన్ని (సోషలిజం) నమ్మేవారు. దాంతో స్వామి అభిప్రాయాలు ఇందిరకు గిట్టేవి కాదు. అందుకే దిల్లీలోని ఐఐటీలో స్వామి ప్రొఫెసరుగా పనిచేస్తున్న సమయంలో, ఆయనను బలవంతంగా ఆ స్థానం నుంచి తొలగించింది ఆనాటి ప్రభుత్వం. తరువాత కాలంలో స్వామి సుప్రీం కోర్టుని ఆశ్రయించి తిరిగి తన స్థానాన్ని దక్కించుకున్నా, ఇందిర మీద ఆయన కోపం మాత్రం తగ్గలేదు. ఇందిరతో స్వామికి ఉన్న వైరాన్ని గమనించిన జనసంఘ్ (ఒకప్పటి బీజేపీ) ఆయనను రాజ్యసభకు పంపింది. ఇక ఎమర్జెన్సీ కాలంనాటికి ఇందిర విధానాలను వ్యతిరేకిస్తూ జనతాపార్టీని స్థాపించి, బలపరచడంలో స్వామి కీలక పాత్రను పోషించారు. జనతా పార్టీ తరువాత కాలంలో బలహీనపడుతూ వచ్చినా 2013 వరకూ కూడా తన భుజస్కాందాల మీద దాన్ని మోశారు. జనతా పార్టీ నానాటికీ క్షీణించిపోతోందని గ్రహించిన స్వామి, 2013లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.
స్వామికి ఉన్న రాజకీయ అనుభవం అపారమైనప్పటికీ, ఆయనను తల్చుకోగానే కేసులే గుర్తుకువస్తాయి. స్వామి వేసిన కేసుల వల్ల ప్రభుత్వాలు కూలిపోవడం, ఎన్నికలలో ఎందుకూ పనికిరాకుండా పోవడం కొత్తేమీ కాదు. ఎక్కడెక్కడి అధికారిక పత్రాలనో వెలికితీసి అధినేతలను ఇరుకున పెట్టడమూ స్వామికి వెన్నతో పెట్టిన విద్య. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందంటూ అప్పట్లో స్వామి కొన్ని పత్రాలను విడుదల చేశారు. దాంతో 1988లో హెగ్డే తన ముఖ్యమంత్రి పదవికి రాజినామా చేయాల్సి వచ్చింది. ఇక తమిళనాట సింహస్వప్నమైన జయలలిత అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకోవడమే కాకుండా, నాలుగేళ్లపాటు జైళ్లో మగ్గడానికీ స్వామి వేసిన కేసులే కారణం. 2010లో 2G స్కాం వెలికిరావడానికి కూడా స్వామి పెట్టిన కేసులే కారణం. ఈ కేసులో అప్పటి టెలికాం ముఖ్యమంత్రి ఎ.రాజా, కరుణానిధి గారాల కూతురు కనిమొళిలను జైలుకి పంపేదాకా స్వామి నిద్రపోలేదు. 2G స్కాం పుణ్యమా అని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాట డీఎంకే ప్రభుత్వాలు తరువాత జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలయ్యాయి.
మిగతా నేతలతో స్వామి వైరం ఒక ఎత్తైతే, ఆయన నెహ్రూ కుటుంబాన్ని వెంటాడే తీరు మరో ఎత్తు! ఒక పక్క సోనియా గాంధి ఇటలీ పౌరసత్వం, రాహుల్ గాంధి బ్రిటిష్ పౌరసత్వం వంటి విషయాల మీద వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటారు. మరో పక్క నేషనల్ హెరాల్డ్ వంటి కుంభకోణాలను వెలికితీసి, సోనియాను కోర్టు బోనులో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. చట్టపరంగా సోనీయా, రాహుల్‌ల మీద ఆయన దూకుడు ఒక తీరైతే... వారి మీద వ్యక్తిగతంగా తీవ్రమైన విమర్శలు చేయడం మరో తీరు. సోనియా గాంధి పుట్టుక దగ్గర్నుంచీ రాహుల్ గాంధి వివాహేతర సంబంధాల వరకూ ఆయన చేయని ఆరోపణ అంటూ లేదు. ఒకోసారి, తిరిగి చెప్పుకోవడానికి కూడా వీల్లేని స్థాయిలో ఆయన ఆరోపణలు ఉంటాయి. అలాంటి ఆరోపణలన్నింటినీ కలిపి ఏకంగా ‘Do you know your Sonia’ పేరిట ఏకంగా ఓ పత్రాన్నే రూపొందించారు. అసలు సోనియా భారత ప్రధాని కాకుండా అడ్డుకున్నది తానేనని కూడా స్వామి చెబుతారు. ఆఖరి నిమిషంలో ఆమె పౌరసత్వం గురించిన వివాదాన్ని అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం దగ్గర ప్రస్తావించాననీ, దాంతో ఆమె కన్నీళ్ల పర్యంతమై ఆ పదవిని వదులుకోవలసి వచ్చిందని అంటారు.
స్వామి రాజకీయాలు, కేసులే కాదు... ఆయనలోని హిందుత్వం గురించి కూడా చెప్పుకోక తప్పదు. తొలి నుంచి జనసంఘ నేతగా ఉన్న స్వామి అణువణువుగా హిందుత్వవాదాన్ని జీర్ణించుకున్న మనిషి. అందుకే ఇస్లాం మతం మీదా, ఇస్లాం తీవ్రవాదం మీదా ఆయన తరచూ విరుచుకుపడుతూ ఉంటారు. భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ ఒకప్పుడు హిందువులే అనీ... ఆ విషయాన్ని వారు అంగీకరించాలని అంటారు. అయోధ్యలో వివాదాస్పద మసీదు స్థానంలో రామమందిరాన్ని నిర్మించాలంటూ సుప్రీం కోర్టులో ఆయన వేసిన కేసు ఇంకా నడుస్తోంది.
అలాగని స్వామి అన్ని విషయాల్లో కరుడుగట్టినట్లు ఉంటారని అనుకోవడానికి లేదు. తమిళ నాట ఎల్.టీ.టీ.ఈకి వ్యతిరేకంగా మాట్లాడే అతి కొద్ది మందిలో స్వామి ఒకరు. అలాగే తమిళ రాజకీయాలకు మూలమనదగిన ‘ఆర్య ద్రావిడ’ సిద్ధాంతాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అయితే తరచూ ఏదో ఒక సంచలన ప్రకటన చేయడం, ఎంత మాట పడితే అంతమాటను అనేయడంతో స్వామి తన విలువను తానే తగ్గించుకుంటూ ఉంటారు. అంతగా పరిశోధన చేసే మనిషి ఏమాత్రం తరచి చూసుకోకుండా చిత్రమైన మాటలను మాట్లాడటంతో ఆయన చిత్తశుద్ధి మీద అనుమానం కలుగక మానదు.
ఏది ఏమైనా దేశ రాజకీయాలను ఆసక్తికరమైన మలుపులు తిప్పడంలోనూ, తప్పు చేసిన వారిని మూడు చెరువులు నీరు తాగించడంలోనూ స్వామికి సాటెవ్వరూ లేరు. అందుకే మోదీ, అమిత్ షా ఇద్దరూ మరో వ్యక్తిని సంప్రదించకుండానే ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారని చెబుతారు. ఉత్తరాఖండ్, జేఎన్‌యూ వంటి సమస్యలలో ఇరకాటంలో ఉన్న ప్రభుత్వానికి స్వామి ఆసరా ఎంతైనా అవసరం! ఆశించినట్లుగానే స్వామి ప్రస్తుతం రాజ్యసభలో అగస్టా కేసును తిరగతోడుతూ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే రీతిలో స్వామి అధికార పార్టీ చేసే పొరపాట్లను కూడా వేలెత్తి చూపితే బాగుండు!