దేవతలారా దీవించండి!

Publish Date:Nov 21, 2013

Advertisement

 

 

 

టీ కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీని ఏనాడో దేవతని చేసేశారు. తెలంగాణ ఇచ్చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత ఆ భావన మరింత పెరిగిపోయింది. ఆ దేవతకి అర్జెంటుగా గుడులో గోపురాలో కట్టించేసి కృతజ్ఞతలు తీర్చుకోవాలన్న ఆకాంక్ష ప్రతి టీ కాంగ్రెస్ నాయకుడిలో భారీ స్థాయిలో ఏర్పడింది. తెలంగాణ ఇచ్చేసి దీవించిన సోనియా దేవత మీద టీ కాంగీయులకు ఆమాత్రం భక్తి వుండటం న్యాయమే! మరి రాష్ట్ర విభజన పావులు చకచకా కదులుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రులు ఏ దేవతని నమ్ముకోవాలి.. ఏ దేవత తమను దీవించి కాపాడుతుందని ఎదురుచూడాలి? ఈ ప్రశ్నకు సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇస్తున్నారు.

 

 

సోనియా దేవత తెలంగాణకు ఇచ్చిన వరాన్ని తిప్పికొట్టే శక్తి వున్న దేవతల గురించి కిరణ్ ఎంతో భక్తిగా చెప్పారు. చిత్తూరు జిల్లాలో వున్న బిడికి అనే గ్రామంలో వున్న ఐదుగురు దేవతలు తెలంగాణ రాకుండా చేసే శక్తి కలిగి వున్నవారని ఆయన చెబుతున్నారు. ఆ గ్రామంలో ఐదుగురు గ్రామ దేవతల దేవాలయం వుందట. ఆ దేవాలయంలోకి వెళ్ళి ఎవరు ఏమి కోరుకున్నా జరిగిపోతుందట. అందుకోసమే కిరణ్ కుమార్ రెడ్డి ఆ గ్రామానికి వెళ్ళారు. రాష్ట్రం విడిపోకుండా సమైక్యంగా ఉంచాలని సదరు ఐదుగురు దేవతను మనసారా కోరుకున్నారు. ఆ దేవతలు తన ప్రార్థన విన్నారని, వాళ్ళు తప్పకుండా రాష్ట్రం విడిపోకుండా చూస్తారని కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు.
రాష్ట్ర విభజన కోసం కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తున్నా, సీమాంధ్రులకు చల్లటి మాటలు చెబుతూ కిరణ్ శాంతపరుస్తున్నారని, రాష్ట్ర విభజన సాఫీగా జరిగిపోవడానికి సోనియా చెబుతున్నట్టు ఆడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ ఎక్కడో చిత్తూరు జిల్లాలో వున్న ఐదుగురు గ్రామ దేవతలు రాష్ట్ర విభజనను ఆపుతారని కిరణ్ ప్రకటించడం చాలా కామెడీగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చిత్తూరు జిల్లాలో వున్న ఐదుగురు దేవతలకంటే సోనియా దేవతే చాలా పవర్ ఫుల్‌గా వున్న ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్ ఇలాంటి ‘ఆధ్యాత్మిక’ కబుర్లు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటున్నారు. కిరణ్ తన మాటల ద్వారా రాష్ట్ర విభజన జరిగిపోవడం ఖాయం.. ఇక మీకు ఆ దేవతలే దిక్కు అని సీమాంధ్రులకు అన్యాపదేశంగా చెబుతున్నారా అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News