గుడి కట్టి బొట్టుపెట్టేశారు!

 

Sonia gandhi Temple in Karimnagar!, Sonia gandhi, telangana state,  Makeshift temple built for Sonia

 

 

అడ్డగోలుగా, అడ్డదారిలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తహతహలాడారు. కరీంనగర్‌లో ‘కృతజ్ఞత సభ’ పెట్టాలని అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి, బయటి పార్టీల నుంచి విమర్శలు రావడం, సమయానికి వర్షాలు కురవడంతో వరుణ దేవుడి పేరు చెప్పి కృతజ్ఞత సభ వాయిదా వేశారు.

 

వరుణ దేవుణ్ణి తలుచుకున్నప్పడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఒక మహత్తరమైన ఐడియా వచ్చినట్టుంది. వెంటనే దాన్ని అమల్లో పెట్టేశారు. కృతజ్ఞత సభ నిర్వహించాలనుకున్న కరీంనగర్లోనే సోనియాకి గుడి కట్టేశారు. సోనియాగాంధీ చిత్రపటానికి బొట్టుపెట్టి, కొబ్బరి కాయలు కొట్టి, పూజలు చేసి, మంగళ హారతి ఇచ్చేశారు. ఆ రకంగా వాళ్ళలో పొంగి పొరలుతున్న కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. సోనియాగాంధీ దేవతకి ఇంత అర్జెంటుగా గుడి ఎలా కట్టారా అని ఆశ్చర్యపోతున్నారా.. తెలంగాణ కాంగ్రెస్ సోనియాకి కట్టింది రియల్ గుడి కాదు. రాత్రికి రాత్రే తయారు చేసిన ఫ్లెక్సీ గుడి.



తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గర మార్కులు సంపాదించుకోవడానికే ఇలాంటి ‘భక్తి’ ప్రదర్శించారని మెడకాయ మీద తలకాయ వున్న ఎవరికైనా అర్థమయ్యే విషయమే.  సోనియాకి ఫ్లెక్సీ గుడి కట్టి, పూజలు తె.కాం. నాయకులు ఏదో ఘనకార్యం చేశామని అనుకుంటూ వుండవచ్చు. అయితే చాలామంది  కాంగ్రెస్ నాయకులే ఈ చర్యని తప్పుపడుతున్నారు. దీనిని మితిమీరిన వ్యక్తిపూజకు పరాకాష్టగా భావిస్తున్నారు. ఇలాంటి ధోరణులే సోనియాగాంధీని నియంతగా మార్చాయని అంటున్నారు. బతికున్న వ్యక్తులెవరికీ గుడులు కట్టరు.  ఆ విషయం తె.కాం. నాయకులకు తెలియదేమోనని బాధపడుతున్నారు.

 

బతికే వున్న ఒక మనిషి ఫొటోకి బొట్టు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేసి, మంగళ హారతి ఇస్తే అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. సోనియాగాంధీ ఫొటోకి సమాధి కట్టడం నేరమయిన పక్షంలో, ఇలా గుడి కట్టి పూజలు చేయడం కూడా  అంతే నేరమని అంటున్నారు.