చర్మం ఒలిచే వ్యాపారం..

 

ప్లాస్టిక్‌ సర్జరీ గురించి మొట్టమొదటిసారి ప్రయత్నం జరిగింది మన దేశంలోనే అని గర్వంగా చెబుతూ ఉంటారు. క్రీ.పూ ఎనిమిదో శతాబ్దంలో శుశ్రుతుడనే భారతీయుడు దీనికి నాంది పలికాడని నమ్ముతారు. ఇదే నేల మీద ఇప్పుడు వికృతమైన వ్యాపారం మొదలైంది. ప్లాస్టిక్‌ సర్జరీ కోసం అమాయకుల చర్మాన్ని ఒలుచుకునే సంస్కృతి సాగుతోంది.

 

సోమా బసు అనే ఒక జర్నలిస్ట్‌ తన వెబ్‌సైట్‌ కోసం చర్మాన్ని అమ్ముకునే వ్యక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం నేపాల్‌లో ఆమె సాగించిన పరిశోధన దేశంలోనే సంచలనం సృష్టించింది. సోమా బసు కథనం ప్రకారం ప్రపంచంలో ప్లాస్టిక్‌ సర్జరీ అవసరాలు నానాటికీ రెట్టింపైపోతున్నాయి. బాగా కాలిపోయిన, గాయపడిన చర్మానికి కొత్త చర్మాన్ని అందించే ప్రయత్నం ఎలాగూ తప్పదు. ఇవి కాకుండా హైఫై సొసైటి వ్యక్తులు, తమ అందాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎంత ఖర్చయినా పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. మరి వీళ్ల అవసరాలు తీర్చేందుకు కావల్సినంత చర్మం ఎక్కడినుంచి వస్తుంది? ఈ ప్రశ్నకి జవాబు నేపాల్‌లో వినిపిస్తుంది.

 

నేపాల్ ఆడవారు తెల్లగా ఉంటారు. పైగా వాళ్లకి పెద్దగా దురలవాట్లు ఉండవు. అందుకని చర్మపు బ్రోకర్లు నిదానంగా వాళ్లని వలలో దింపుతారు. 20 చదరపు అంగుళాల చర్మానికి పదివేల రూపాయలు ఇస్తామని చెబుతారు. ఆ కాస్త సొమ్ముకీ పేద యువతులు తలలూపుతారు. వారి చర్మాన్ని బ్రోకర్లు ‘ప్రతిష్టాత్మక లేబరేటరీ’ల్లో ఒలిపిస్తారు. ఆ లేబొరేటరీలు ఒలిచిన చర్మాన్ని శుద్ధిచేసి, వాటిని అమెరికాకు పంపుతాయి. ఆ చర్మంతో అమెరికా సంస్థలు ప్లాస్టిక్‌ సర్జరీ కోసం ఉపయోగించే Acellular dermis అనే పొరను తయారుచేస్తాయి. వాటిని ‘Alloderm’ వంటి పేర్లతో ప్రపంచమంతా విక్రయిస్తుంటారు.

 

ప్లాస్టిక్‌ సర్జరీల కోసం చర్మాన్ని విక్రయించే అమెరికన్‌ కంపెనీల మీద సవాలక్ష ఆరోపణలు ఉన్నాయి. వీళ్లు శవాల నుంచి కూడా చర్మాన్ని సేకరించారంటూ కేసులు నడిచాయి. కానీ డబ్బుబలంతో ఎన్ని కేసులనైనా ఎదుర్కొని ఈ కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. అమెరికాలోని అత్యున్నత వైద్య సంస్థ FDA సైతం వీటిని నియంత్రించలేక చేతులెత్తేసింది. దాంతో తమకు కావల్సిన చర్మం కోసం ఈ కంపెనీలు ఇండియా, నేపాల్‌ దేశాలను కుటీర పరిశ్రమలుగా మార్చిపారేశాయి.

 

జనం ఓ నాలుగు డబ్బుల కోసం చర్మాన్ని అమ్ముకోవడం వేరు. ఇంతకంటే దారుణంగా చర్మాన్ని సేకరించే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. వేశ్యావృత్తిలో ఉన్నవారికి మత్తుమందు ఇచ్చి, వారికి మెలకువ వచ్చేలోగా శరీరం మీద ఎక్కడపడితే అక్కడ చర్మాన్ని ఒలిచేసే క్రూరత్వం కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా అక్కడ ఎవరూ నోరు మెదపడానికి వీల్లేదు. పొరపాటున ఎవరన్నా నోరెత్తే ప్రయత్నం చేస్తే... వాళ్లు ఏ మురుగుకాల్వలోనో కలిసిపోక తప్పదు. తమకు ఎదురుతిరిగిన వాళ్లనీ, వారి కుటుంబాలనీ... వేటాడి వెంటాడేంత భయంకరమైన మాఫియా అక్కడ రాజ్యమేలుతూ ఉంటుంది.

 

జరుగుతున్న తతంగమంతా ప్రభుత్వాలకి తెలుసు, ప్రజలకూ తెలుసు, పోలీసులకూ తెలుసు. కానీ ఎవరూ ఏమీ ఎరగనట్లుగా ఈ అందమైన ప్రపంచం గురించే మాట్లాడుతుంటారు. అదే సుఖం కదా!!!