సోషల్ మీడియా వెర్రితలలు

అతి సర్వత్రా వర్జయేత్. ఈ నానుడి సోషల్ మీడియాకు సరిగ్గా సరిపోతుంది. ఏ అంశంలోనూ ఎక్కువగా ఆలోచించకూడదని, దేని పైనా ఎక్కువ ప్రేమను కాని, ద్వేషాన్ని కాని పెంచుకోకూడదని కూడా ఈ ఆర్యోక్తి ప్రతిసారీ రుజువు చేస్తోంది. దీనికి తాజా ఉదాహరణ బీదర్‌‌లో జరిగిన సంఘటన. అక్కడున్న తమ వ్యవసాయ క్షేత్రాన్ని చూసేందుకు వెళ్లిన ఓ కుటుంబంపై గ్రామస్థులు కిడ్నాపర్లు అనే అనుమానంతో దాడి చేశారు. దాదాపు రెండు వందల మంది గ్రామస్థులు విక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో మహ్మద్ అజాం అనే యువకుడు మరణించగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడికి
కారణం ఒకవైపు అనుమానాలైతే... మరోవైపు దావానలంలా వ్యాపించిన వాట్సప్ మెసేజ్‌లు.

 

 

ఇది ప్రపంచంలో సోషల్ మీడియాకున్న ప్రాధాన్యం చెబుతున్నా.... మరోవైపు సోషల్ మీడియా మరో రూపాన్ని కూడా చాటుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబానికి బీదర్‌లో వ్యవసాయ క్షేత్రముంది. వారాంతపు సెలవులు కావడంతో ఆ కుటుంబంలో నలుగురు తమ వ్యవసాయ క్షేత్రాన్ని చూసేందుకు తమ కారులో బీదర్ వెళ్లారు. వీరిలో ఒకరు గూగుల్ ఉద్యోగి కాగా మరొకరు ఖతర్ దేశంలో పోలీస్ ఉద్యోగం చేస్తున్న మహ్మద్ సలాం. ఆయన ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. ఖతర్ నుంచి వచ్చిన మహ్మద్ సలాం వరుసకు సోదరులైన మహ్మద్ అజం, మ‌హ్మద్ సల్మాన్, నూర్ మహ్మద్ నలుగూరూ తమ సొంత వాహనంలో బీదర్‌ జిల్లా హండీకేరాలో ఉన్న వ్యవసాయ భూముల వద్దకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముర్కి గ్రామ పరిథిలోని టోకుల్లా బ్యాండ్ వద్ద వీరి కారు నిలిపారు. అక్కడికి సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్ధినులకు ఖతర్ నుంచి తీసుకువచ్చిన చాక్లెట్లు పంచిపెట్టారు. 

 

 

అదే వీరు చేసిన నేరం. వీరిని కిడ్నాపర్లుగా భావించిన ఉమేష్ బరాద్ అనే యువకుడు పిల్లలకు చాక్లెట్లను ఎందుకు పంచుతున్నారని ఓ వైపు ప్రశ్నిస్తూనే గ్రామస్థులకు తన వాట్సప్ ద్వారా గ్రామంలోకి కిడ్నాపర్లు వచ్చారనే సమాచారాన్ని అందించారు. అంతే ఒక్కసారిగా వందలాది మంది గ్రామస్థులు పాఠశాల సమీపానికి చేరుకుని నలుగురు యువకులపైనా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారు బోల్తా పడింది. గ్రామస్ధుల విచక్షణారహిత దాడిలో గూగుల్ ఉదో్యగి మహ్మమద్ అజీం ప్రాణాలు కోల్పోయారు.

 

 

ఈ సంఘటన రెండు వాస్తవాలను చెబుతోంది. ఒకటి విచ్చలవిడిగా.... అడ్డూ అదుపు లేకుండా వాడకంలోకి వచ్చిన సోషల్ మీడియా అయితే మరొకటి దేశంలో పిల్లలకు భద్రత లోపించిందనే అంశం. ముందుగా సోషల్ మీడియా విస్తరణ కారణంగా సమాజంలో నేరాలు... ఘోరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫేస్‌బుక్ ప్రేమలు... వివాదాలు.... దొంగ మెసేజ్‌లతో డబ్బులు దొంగిలించడం... చివరకు ఆధార్ కార్డుల రూపకల్పన, సెల్‌ఫోన్ సిమ్‌ల తయారీ వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఈ సోషల్ మీడియా లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చేసింది. ఏ బస్సులో చూసినా... ఏ రైలులో చూసినా... పది మంది కూడిన ఏ ప్రదేశంలో చూసినా మాటల్లేవు... మాటాడుకోవడాల్లేవ్... అందరిదీ ఒకే బాట... వాట్సప్‌ మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌లో చాటింగ్‌లు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలో సందేశాలు. దీనికి వయసుతో సంబంధం లేదు. చిన్నాపెద్దా విచక్షణ లేదు.

 

 

ఈ సోషల్ మీడియా కారణంగా రోజురోజుకూ ఎన్ని అనర్ధాలు జరుగుతున్నా ప్రజల్లో దీని పట్ల మమకారం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఒక్క మేసేజ్‌తో వందల మంది గ్రామస్థులు ఒక చోట చేరి ఈ ఘోరం చేశారంటే  సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నాణానికి మరోవైపు అన్నట్లుగా దీని వల్ల కొన్ని చోట్ల మంచి జరుగుతున్నా అది చాలా తక్కువ సందర్భాల్లోనే. దీనిపై స్వీయ నియంత్రణే చేసుకోవాలి తప్ప ప్రభుత్వాలు చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రధానమంత్రితో పాటు అన్ని రాష్ట్రాల మఖ్యమంత్రులు, మంత్రులు, సినీ స్టార్లు, క్రికెటర్లు... ఇలా సమాజంలో పెద్దవారు అనుకునే వారంతా ఈ సోషల్ మీడియాకు దాసులైపోయారు.

 

 

ఇక దేశంలో చిన్నారుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ చూసినా చిన్నారులపై లైంగిక దాడులు, కిడ్నాపులు ఎక్కువయ్యాయి. వీటిని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నా దేశంలో ఉన్న చట్టాలు నేరం చేసిన వారిని సునాయాశంగా జైళ్ల నుంచి విడుదల చేయిస్తున్నాయి. దీంతో ఈ ఆగడాలు నానాటికీ పెరుగుతున్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తే ఈ దారుణాలకు స్వస్తి పలకవచ్చు. ముందుగా వ్యక్తిలో మార్పు రావాలి. అందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు క్రషి చేయాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. దేనిని ఎంత వరకూ ఉపయోగించాలో కూడా ఎరుకలో ఉండాలి.