ఆర్బీఐ తీరుపై సుప్రీంకోర్టు అసహనం.. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థికాంశాలు ముఖ్యమా?

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. లోన్లు, ఈఎంఐలు లపై ఆరు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మారటోరియం ఎంచుకున్నవారికి ఈ ఆరు నెలల కాలానికి ఔట్‌ స్టాండింగ్‌పై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, మారిటోరియం విధించినా, రుణవాయిదాలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఓ వైపు మారటోరియానికి అవకాశం ఇస్తూనే మరోవైపు వడ్డీ వసూలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు ఆర్బీఐని తప్పుపట్టింది. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థికాంశాలు ముఖ్యం కాదని అభిప్రాయపడింది. 

మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ చేయాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టులో ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఒకవేళ మారటోరియం కాలంలో వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులు రూ.2 లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తుందని ధర్మాసనానికి నివేదించింది. ఈ అంశంపై ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసేముందు మీడియా సంస్థలకు లీక్ చేయడం పట్ల సుప్రీంకోర్టు మండిపడినట్టు సమాచారం. ‘మీడియాకు లీకులు ఇస్తూ ఈ అంశాన్ని మరింత సంచలనం చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది.’అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఓ వైపు మారటోరియంకు అనుమతిస్తూనే మరోవైపు వడ్డీపై ఎలాంటి ఉపశమనం లేకుండా చేయడం మరింత ప్రమాదకరం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితిని తాము అర్ధం చేసుకుంటాం.. కానీ, ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే ముఖ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ, ఆర్బీఐ వివరణ కోరుతూ.. తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.