దీనస్థితిలో శశికళ జైలు జీవితం... !


ఓడలు బండ్లు... బండ్లు ఓడలు అవుతాయి అన్న సామెత శశికళకు బాగా సరిపోయేట్టు ఉంది. ఆమె ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత అధికారం చేపట్టి తమిళనాడును ఏలుదామని అనుకుంది. సీఎంగా ఇక ప్రమాణం చేస్తారు అని అందరూ అనుకోగా.. ముందుగా దురదృష్టం ఆమె తలుపుతట్టి.. అక్రమాస్తుల కేసులో ప్రతికూలంగా తీర్పురావడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక ఆతరువాత ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వచ్చిపడుతూనే ఉన్నాయి. తాను సీఎంగా పగ్గాలు చేపట్టలేకపోయింది... కనీసం సీఎం పళనిస్వామి.. తన మేనల్లుడు దినకరన్ ద్వారా అయినా సరే జైలులో ఉండే పార్టీని నడిపించాలని అనుకున్నారు. అది కూడా వర్కవుట్ కాలేదు. పార్టీ  గుర్తు కోసం ఏకంగా ఈసీ అధికారులకే లంచం ఇవ్వడానికి పూనుకొని దినకరన్ బుక్ అయ్యారు. ఆయనను కాస్త ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ అయ్యారు. దీనికితోడు విచారణలో చిన్నమ్మ శశికళ ఆదేశం మేరకే దినకరన్ ముడుపులు ఇవ్వజూపారన్న సాక్ష్యాలు సేకరించారు పోలీసులు. ఇక పళనిస్వామి కూడా ఆమెను వ్యతిరేకించిన పన్నీరు సెల్వంతో జత కట్టేందుకు సిద్దపడ్డాడు. దీంతో మరిన్ని చిక్కుల్లో పడ్డట్టైంది.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పన జైలులో ఉన్న ఆమెను పలకరించడానికి నేతలు కూడా కరువయ్యారట. బయట ఉన్నప్పుడు చిన్నమ్మకు వంగి వంగి దండాలు పెట్టిన నేతలు ఇప్పుడు కనీసం అమెను చూడటానికి రావడానికి తీరిక లేకుండా పోయినట్టు ఉంది. ఆమె అరెస్ట్ అయిన మొటల్లో ఎక్కువ సందర్శకులు వచ్చినా.. ఇప్పుడు వారి సంఖ్య భారీగా తగ్గింది. గత 14 రోజుల్లో ముగ్గురు మాత్రమే రాగా, వీరిలో ఒకరు శశికళ దగ్గరి బంధువైన డాక్టర్‌ ఉన్నారు. ఇక జైల్లో శశికళను సాధారణ ఖైదీగా పరిగణిస్తున్నారు. ఆమె వదిన ఇళవరసి ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నా.. అనారోగ్య సమస్యల వల్ల ఇళవరసి ఎక్కువగా జైలు ఆస్పత్రిలో ఉండటంతో సెల్‌లో శశికళ ఒంటరిగా ఉంటున్నారు. చిన్నమ్మ ఎక్కువ సమయం టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నట్టు జైలు అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వచ్చిపడుతున్న నేపథ్యంలో శశికళ కాస్త డిప్రేషన్ కు గురవుతున్నట్టు సమాచారం. మొత్తానికి శశికళ కూడా ఊహించి ఉండదేమో తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని..