షిరిడీలో అధ్బుతం ....భక్తుల కాలి అడుగుల నుంచి కరెంట్

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ట్రస్ట్ ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన బోర్డు సమావేశంలో పలు సంస్కరణలకు పచ్చ జెండా ఊపింది. దీనిలో భాగంగా ఆలయ అవసరాల కోసం వినియోగించే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని నిర్ణయించింది.

అది కూడా పూర్తి పర్యావరణ అనుకూల విధానంలో..అది ఎలాగో తెలుసా..? భక్తుల కాలి అడుగుల నుంచి విద్యుత్ ఉత్పత్తి.. మ్యాన్‌కైండ్‌ సంస్థ సహకారంతో షిరిడీ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకమైన టైల్స్‌ను అమరుస్తారు. 2X2 అడుగుల వ్యాసార్థంతో మొత్తం 200 టైల్స్‌ను అమరుస్తారు. భక్తులు వాటిపై నడిచినప్పుడు వెలువడే శక్తిని అవి విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ఒక వ్యక్తి నుంచి సరాసరి 20 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చట. రాబోయే అక్టోబర్ నాటికి తలి విడతను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ట్రస్ట్ భావిస్తోంది. ఇది విజయవంతమైతే ఈ తరహా విధానాన్ని అనుసరించిన తొలి సంస్థగా షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ రికార్డుల్లోకి ఎక్కుతుంది.