రష్యా విమానాన్ని కూల్చివేసిన ఐసిస్ ఉగ్రవాదులు?
posted on Oct 31, 2015 2:35PM
రష్యాకు చెందిన నెంబర్: 9268 విమానం ఈజిప్టులో సెంట్రల్ సినాయ్ అనే ప్రాంతంలో ఈరోజు ఉదయం కూలిపోయింది. ఆ విమానంలో మొత్తం 217 మంది ప్రయాణికులు 7 మంది విమాన సిబ్బంది కలిపి మొత్తం 224మంది ఉన్నట్లు సమాచారం. వారందరూ ఈ మరణించి ఉండవచ్చని ఈజిప్ట్, రష్యా దేశాలు భావిస్తున్నాయి. ఈజిప్టు స్థానిక కాలమాన ప్రకారం ఇవ్వాళ్ళ ఉదయం 06:51గంటలకు షర్మ్-అల్-షేక్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఫ్లయిట్ నెంబర్: 9268 విమానం, టేక్-ఆఫ్ తీసుకొన్న23 నిమిషాలకే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం ఈజిప్టు నుండి బయలుదేరి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో గల పుల్కొవ్ విమానాశ్రయానికి 12:10 గంటలకు చేరుకోవలసి ఉంది. కానీ సెంట్రల్ సినాయ్ అనే ప్రాంతంలో కూలిపోయినట్లు ఈజిప్ట్ ప్రధాని షరీఫ్ ఇస్మాయిల్ కార్యాలయం ద్రువీకరించింది. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై రష్యా దాడులు చేస్తునందున వారు అందుకు ప్రతీకారంగానే ఈ విమానాన్ని కూల్చివేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈ వార్తలను ఇంకా దృవీకరించలేదు. ఐసిస్ ఉగ్రవాదులు కూడా ఇంత వరకు దీని గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు.