భుజం తట్టే చేయి లేకపోతే!

ఇంగ్లండులో ఒకప్పుడు రోసెట్టి అనే గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. ఆయన దగ్గరకి ఓసారి ఓ నడివయసు మనిషి వచ్చాడు. ఆయన చేతిలో చాలా కాగితాలు ఉన్నాయి. వాటిలో ఒక బొత్తిని రోసెట్టి చేతిలో పెట్టి- ‘ఇవన్నీ నేను వేసిన బొమ్మలు. వాటిని మీరొక్కసారి పరిశీలించి నేను బొమ్మలు గీసేందుకు పనికొస్తానో లేదో తెలియచేయగలరా!’ అని ప్రాథేయపడ్డాడు.


నిజానికి రోసెట్టి ఆ రోజు చాలా పనిఒత్తిడిలో ఉన్నాడు. అయినా కూడా పెద్దాయన మాటని కాదనలేకపోయాడు. నిదానంగా ఆ బొత్తిని చేతిలోకి తీసుకుని వాటిలో ఒకో చిత్రాన్నే పరిశీలించసాగాడు. ప్చ్‌! ఆ బొమ్మలు చాలా సాదాసీదాగా ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క చిత్రంలోనూ చిత్రకారుడి ప్రతిభ కనిపించనేలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అవన్నీ నాసిరకంగానూ, ప్రాథమిక స్థాయిలోనూ ఉన్నాయి. ఆ విషయం చెబితే వచ్చిన మనిషి బాధపడతాడని తెలుసు. కానీ ఓ విమర్శకుడిగా ఉన్నమాటని సున్నితంగా అయినా చెప్పక తప్పలేదు. ‘మీ బొమ్మలు ఏమంత గొప్పగా లేవండీ! మరిన్ని మంచి చిత్రాలు గీయాలంటే మీరు చాలా కృషి చేయాల్సి ఉంటుంది,’ అంటూ సుతిమెత్తగా చెప్పాడు రోసెట్టి.


రోసెట్టి నోటి వెంట అలాంటి మాటలే వస్తాయని ఆ పెద్దాయనకు తెలుసు. అయినా ఆయన మనసు బాధగా మూలిగింది. ‘మీ విలువైన సమయాన్ని వృధా చేసినందుకు క్షమించండి. మరేమనుకోకపోతే నా దగ్గర మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఓసారి చూడగలరా,’ అంటూ ఇంకో బొత్తిని చేతిలో పెట్టాడు.


నిరాసక్తిగా రెండో బొత్తిని చేతిలోకి తీసుకున్న రోసెట్టి  కళ్లు చెదిరిపోయాయి. ఆ చిత్రాలలోని నైపుణ్యం చాలా అసాధారణంగా ఉంది. చిత్రాలలో చిన్న చిన్న వివరాలను కూడా చాలా అద్భుతంగా మలిచాడు చిత్రాకారుడు. ఒక్కమాటలో చెప్పాలంటే తను ఈ మధ్య కాలంలో ఇంత ప్రతిభ చూపిన చిత్రాలను చూడనే లేదు. ‘ఈ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిని గీసిన చిత్రకారుడి భవిష్యత్తుకి తిరుగులేదు. కాస్త ప్రోత్సాహం కనుక ఉంటే... అతను దేశంలోనే గొప్ప చిత్రకారుడిగా నిలుస్తాడు. ఇంతకీ ఇవన్నీ మీ కొడుకు గీశాడా లేకపోతే మీ ఊరిలో ఎవరన్నా కుర్రవాడు గీశాడా. ఎవరతను ఓసారి అతణ్ని నా దగ్గరకి తీసుకురండి. అతణ్ని చూడాలని ఉంది,’ అంటూ ఉద్రేకపడిపోయాడు.


ఆ మాటలు వింటూనే పెద్దాయన కంటి వెంట నీరు ఆగలేదు. ‘అయ్యా! ఇవన్నీ నేను వయసులో ఉన్నప్పుడు గీసిన చిత్రాలు. అప్పట్లో నాకు చిత్రాలు గీసేందుకు తగిన ప్రతిభ ఉందనుకునేవాడిని. ఎవరి దగ్గరా శిక్షణ లేకుండానే ఈ చిత్రాలన్నీ గీయగలిగాను. కానీ నాలో ప్రతిభ ఉందన్న విషయం ఏ ఒక్కరూ కూడా ఒప్పుకోలేదు. నా భుజం తట్టి ప్రోత్సహించలేదు. నేను గీసిన చిత్రాలను చూసి మనస్ఫూర్తిగా మెచ్చుకోలేదు. ఎన్నాళ్లని నాలో ప్రతిభ ఉందన్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలను? నిదానంగా నా మీద నాకే అపనమ్మకం మొదలైంది. ఆ న్యూనత నా చిత్రాలలోనూ కనిపించసాగింది. అయినా చేతులాగక అడపాదడపా అనురక్తితో బొమ్మలు గీస్తూనే ఉన్నాను. కానీ అవి ఎలా ఉంటున్నాయో మీరు ఇందాక చూశారుగా!’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.