తెలంగాణ ప్రభుత్వానికి ఝలక్కుల మీద ఝలక్కులు
posted on Jun 30, 2015 5:25PM
నోటుకు ఓటు కేసులో ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. తెదేపాని దెబ్బతీయాలని తెలంగాణ నేతలు చాలా పథకం ప్రకారం వ్యూహాన్ని రచించి రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించారు. అయితే గత వారం రోజుల నుండి ఈ కేసులో అంత ఆసక్తికర పరిణామాలేవి చోటుచేసుకోలేకపోవడంతో ఈ కేసులో రెండు ప్రభుత్వాలు కొంచెం వెనక్కి తగ్గి పరిస్థితి సద్దుమణిగిందేమో అనిపించింది. కానీ నేడు రేవంత్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మళ్లీ కేసులో కీలకమైన మలుపులు తిరుగుతాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా శాయశక్తుల ప్రయత్నించిన తెలంగాణ ఏసీబీ అధికారులు బెయిల్ రాకపోవడాన్ని జీర్ణించుకోలేరేమో. అందుకే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.
ఇదిలా ఉండగా ఏపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశంను ప్రభుత్వం తప్పించిందనే ప్రచారం సాగుతోంది. ఆస్థానంలో ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది నియమితులయినట్టు తెలుస్తోంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఏపీ నేతలు ఆరోపించిగా దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో బుర్రా వెంకటేశ్ అకస్మాత్తుగా నెల రోజులు సెలవులు పెట్టినట్టు తెలిసింది. కేసు కీలక దశలో ఉన్న సందర్భంలో బుర్రా వెంకటేశ్ సెలవులపై వెళ్లిన నేపథ్యంలో అతనిని తప్పించి తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేదిని హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఏపీ ప్రభుత్వ వాదనకు మరింత ఊతమిచ్చినట్లయింది.
మరోవైపు రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని కొట్టుకు చస్తుంటే హైకోర్టు అందరికి దిమ్మతిరిగి పోయే తీర్పు నిచ్చింది. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలులోనే ఉందని హైదరాబాద్ లో బాధ్యతలు చేపట్టాల్సిన బాధ్యత గవర్నర్ పై నే ఉందని కేంద్రాన్ని అడగాల్సిన అవసరం లేదని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అందరికి ఫుల్లు క్లారిటీ వచ్చినట్టుంది. ఇక గవర్నర్ సక్రమంగా బాధ్యతలు చేపడితే శాంతి భద్రతల విషయంలో సీమాంధ్రులకు ఎటువంటి సమస్య లేనట్టే. మొత్తానికి ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఝలక్కులు మీద ఝలక్కులు తగులుతున్నట్టున్నాయి. అటు రేవంత్ రెడ్డి బెయిల్ విషయంలో.. హోం శాఖ ప్రధాన కార్యదర్శి మార్పు.. సెక్షన్ 8 పై మూడు విషయాలలో చుక్కెదురైంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఒక్కసారి ఆలోచిస్తే మంచిదనిపిస్తోంది.