రేవంత్ కేసు.. ఎంపీ ఖాతా నుండి డబ్బు డ్రా?

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇవ్వడానికి తెచ్చిన రూ. 50 లక్షలు ఎక్కడి నుండి తీసుకొచ్చాడో తెలుసుకునే పనిలో పడింది ఏసీబీ. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ కు ఇవ్వడానికి తీసుకొచ్చిన డబ్బు నోట్లపై బ్యాంకు లేబుల్స్ లేకపోవడంతో నోట్లపై ఉన్న నెంబర్ల ఆధారంగా ఆ డబ్బు ఓ చిన్న బ్యాంకు ద్వారా డ్రా చేశారన్న విషయం తెలుసుకున్నారు. అయితే ఆడబ్బు చంద్రబాబుకు అతి సన్నిహితుడైన ఓ ఎంపీ ఖాతా నుండి డ్రా చేసినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన 4.5 కోట్ల డబ్బుల గురించి దర్యాప్తు చేపట్టారు ఏసీబీ అధికారులు. మరోవైపు రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ తో మాట్లాడేటప్పుడు బాస్ అని అన్న నేపథ్యంలో అసలు ఆ బాస్ ఎవరు అనే విషయం తెలుసుకునేందుకు గట్టి ప్రయత్న చేస్తుంది ఏసీబీ. దీనికి సంబంధించి రేవంత్ కస్టడీలో ఉన్నప్పుడు విచారించగా రేవంత్ రెడ్డి మాత్రం నోరు విప్పలేదు. దీంతో ఏసీబీ రేవంత్ గతంలో మాట్లాడిన వీడియోలు ఏ ఏ సందర్భాలలో బాస్ అని మాట్లాడాడు.. ఎవరిని ఉద్దేశించి బాస్ అనే పదం ఉపయోగించాడో తెలుసుకునే పనిలో పడింది. మొదటి దర్యాప్తులో చేపట్టిన సమాచారంతో చంద్రబాబుకు, ఇతర మంత్రులకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ కసరత్తు చేస్తోంది.