అంగరంగ వైభోగంగా రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్ధం

 

తెదేపా యంయల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ వివాహ నిశ్చితార్ధ వేడుక ఎటువంటి అవాంతరాలు లేకుండా అంగరంగ వైభోగంగా పూర్తయింది. హైదరాబాద్ యన్. కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఈ వేడుకకు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సుమారు 700మందిని మాత్రమే ఆహ్వానించగా, సినీ, రాజకీయ, పారిశ్రామిక, మీడియా రంగాలకు చెందిన సుమారు 3,000 మంది ప్రముఖులు ఎటువంటి ఆహ్వానం లేకపోయినా తమంతట తామే తరలివచ్చి కాబోయే దంపతులను ఆశీర్వదించడం చాలా విశేషం. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ తదితరులు కుటుంబ సమేతంగా వచ్చి కాబోయే దంపతులను ఆశీర్వదించారు.

 

అదే విధంగా అనేకమంది కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన స్నేహితుడయిన రేవంత్ రెడ్డికి తను అండగా ఉంటానని, ఆయన నిరాపరధి అని తను నమ్ముతున్నానని అన్నారు. త్వరలోనే ఆయన తెలంగాణా ప్రభుత్వం పెట్టిన ఈ కేసుల నుండి బయటపడతారనే నమ్మకం తనకుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు దంపతులు రేవంత్ రెడ్డితో కలిసి ఫోటో దిగారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు తదితరులు ఆయనను ఆప్యాయంగా కౌగలించుకొన్నారు.

 

ఎసిబి అధికారులు ఆయనకు సమీపంలోనే తచ్చాడుతూ ఆయన ప్రతీ కదలికను, మాటను జాగ్రత్తగా కనిపెట్టుకొని చూస్తుండటంతో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందారు. రేవంత్ రెడ్డి తన కుమార్తె నిశ్చితార్దాన్ని ఎంతో సంతోషంగా చేస్తున్నప్పటికీ, ఆయన తిరిగి జైలుకి వెళ్లి పోవలసిన సమయం దగ్గర పడుతుండటంతో ఆయన కుటుంబ సభ్యులలో ఆందోళన కొట్టవచ్చినట్లు కనబడింది. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరినీ స్వయంగా ఆహ్వానించి మర్యాదలు చేసారు. కాకపోతే కోర్టు ఆంక్షలు మూలంగా ఆయన అందరితో క్లుప్తంగా పలకరింపులతోనే సరిపెట్టు కోవలసివచ్చింది. ఎటువంటి ఆహ్వానం లేకపోయినప్పటికీ అనేకమంది ప్రముఖులు వచ్చి తామందరం ఆయనకు, ఆయన కుటుంబానికి అండగా ఉన్నామనే బలమయిన సంకేతం ఇవ్వగలిగారు.