రేణుక శవరాజకీయం!

 

 

 

రేణుకా చౌదరి శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు. తన రాజకీయ లబ్ధి కోసం వేరే ఎవరి శవాన్నో కాకుండా తన శవాన్నే ఉపయోగించుకుంటున్నారు. భద్రాచలం తెలంగాణలోనే వుండాలని, భద్రాచలాన్ని ఎవరైనా తీసుకెళ్ళాలని అనుకుంటే తన శవం మీద నుంచి తీసుకెళ్ళాలని రేణుక సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

భద్రాచలం జోలికి ఎవరైనా వస్తే తన తడాఖా ఏమిటో చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఆమె తెలంగాణలో పుట్టి పెరగకపోయినా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ ‘భద్రాచలాన్ని సీమాంధ్రకి ఇచ్చే సవ్వాలే లేదు’ అని నొక్కి వక్కాణించారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం ఏమైనా చేస్తారు.. దేనినైనా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రేణుకా చౌదరి ఈ వర్గానికి చెందిన నాయకురాలేమోనన్న సందేహాలు ఆమె మాటల్ని వింటే కలుగుతున్నాయి.



గతంలో ఎప్పుడూ తెలంగాణ ఉద్యమం చేసిన పాపాన పోని రేణుక ఇప్పుడింత సడెన్‌గా భద్రాచలం విషయంలో ‘శవం’ వరకూ వెళ్ళడానికి గల కారణాలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ లబ్ది కోసమే రేణుక ఇలాంటి పవర్‌ఫుల్ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తెలంగాణ ఆడపడుచు కాని రేణుకా చౌదరి గతంలో ఎన్నడూ తెలంగాణ అనుకూల ఉద్యమంలో పాల్గొనలేదు. గతంలో ఖమ్మం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన రేణుక ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలిగా వున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు.


అయితే తెలంగాణ ఉద్యమంలో పనిచేయని రేణుకా చౌదరిని ఖమ్మం స్థానం నుంచి దూరం చేయాలని కాంగ్రెస్ పార్టీలోని ఒకవర్గం చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఖమ్మం నుంచి రేణుక పోటీ చేయాలంటే రేణుక తన బర్త్ సర్టిఫికెట్ చూపించాలనే డిమాండ్ వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతమాత్రం పాలు పంచుకోని రేణుకకు ఖమ్మం సీటు ఇవ్వరాదన్న డిమాండ్ రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తాను కూడా తెలంగాణ వాదినేనని కలరింగ్ ఇచ్చుకోవడం కోసం, తెలంగాణ ప్రజల్లో మంచి మార్కులు సంపాదించడం కోసమే రేణుక భద్రాచలం తెలంగాణదే అంటూ నినదిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న వారికి చెక్ పెట్టడం కోసమే రేణుకా చౌదరి ‘శవం’ స్థాయిలో వ్యాఖ్యానించారని అంటున్నారు.