గంటా-అవంతికి అసలు ఎక్కడ చెడింది? శత్రువులుగా ఎందుకు మారారు?

 

రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి...ఓడలు బండ్లు అవుతాయి...మిత్రులు శత్రువులు అవుతారు...శత్రువులు మిత్రువులవుతారు. పరిస్థితులను బట్టి, పగ-ప్రతీకారాలు, స్నేహాలు-అభిమానులు మారిపోతుంటాయి. ప్రస్తుతం వైజాగ్ లో ఇద్దరు స్నేహితుల మధ్య ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఒకప్పుడు ఒకరి గెలుపు కోసం, ఒకరు సహకరించుకున్న నేతలు, ఇఫ్పుడు పార్టీలు మారి, కత్తులు నూరుతున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రువులుగా మారిపోయారు. వీళ్లిద్దరూ ఎవరో కాదు... ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. టీడీపీ నుంచి మొదలైన వీరిద్దరి ప్రయాణం... ఆ తర్వాత పీఆర్పీ... అనంతరం కాంగ్రెస్... మళ్లీ టీడీపీ ఇలా 2019వరకు దాదాపు దశాబ్దన్నరపాటు సాగింది. ఇద్దరూ కూడా పరస్పర సహకారంతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే, 2019 ఎన్నికలకు ముందు టికెట్ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. భీమిలి టికెట్ కోసం ఇద్దరూ పట్టుబట్టడంతో రగడ మొదలైంది. అయితే, ఇరువురి మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారు. అవంతి శ్రీనివాస్ అనూహ్యంగా వైసీపీలో చేరి ఏకంగా మంత్రి అయ్యారు. అయితే, అవంతి టీడీపీలో ఉండగా, భీమిలి కోసం పట్టుబట్టిన గంటా... చివరి నిమిషంలో మనస్సు మార్చుకుని తన సెంటిమెంట్ ప్రకారం నియోజకవర్గాన్ని మార్చేసి, జగన్ సునామీలో సైతం విశాఖ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, గంటా వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని పసిగట్టిన అవంతి...మాటల తూటాలు విసరడం మొదలుపెట్టాడు. దాంతో గంటా కూడా అంతే దీటుగా కౌంటర్ ఇవ్వడంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.

తాను వైసీపీలో చేరాలనుకుంటే, ఎవరూ అడ్డుకోలేరంటూ అవంతిని ఉద్దేశించి గంటా కామెంట్స్ చేయడం కలకలం రేపాయి. అవంతి అసలు తనకు మంత్రిలాగే అనిపించడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో విశాఖ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. గంటా కామెంట్స్ పై ఘాటుగా రియాక్టయిన అవంతి... తాను నోరు విప్పితే తట్టుకోలేరంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు అధికారం లేకపోతే అల్లాడిపోయే గంటా శ్రీనివాసరావు... వైసీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారని, కానీ జగన్ గేట్లు మూసేయడంతో దిక్కులేక ఆగిపోయారంటూ సెటైర్లు వేశారు. అయితే, వీళ్లిద్దరి శత్రుత్వం చూసి, సన్నిహితులు ఆశ్చర్యపోతున్నారట. అయితే, మరో మాట కూడా వినిపిస్తోంది. పైకి పోట్లాడుకుంటున్నారని, కానీ లోలోపల సఖ్యతగానే ఉన్నారనీ అంటున్నారు. మరి వీళ్లిద్దరి యుద్ధం ఎటువంటి మలుపులు తిరుగుతుందో, ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.