ఇది తెలుగు ప్రజలు కోరుకున్న విజయం
posted on Apr 17, 2015 1:52PM
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా ఎన్నికైన విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్ ప్యానల్లోని మరికొంతమంది కూడా ఈ ఎన్నికలలో విజయం సాధించారు. ఈ విజయం పట్ల ‘మా’ నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారందరూ కోరుకున్న విజయమని ఆయన అన్నారు. ‘‘ఎన్నో పరీక్షలను తట్టుకుని, దాటుకుని ఈ ఎన్నికలలో విజయం సాధించాం. ఈ క్షణం నుంచి నేను అధ్యక్షుడిగా వున్నంతకాలం అసోసియేషన్ డబ్బులతో కనీసం టీ కూడా తాగను. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. సినిమా కళాకారులందరూ నవ్వుతూ బతకాలన్నదే నా కోరిక. ఎన్టీఆర్ స్ఫూర్తితో కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తాం. ఈ విజయాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నాను. నా విజయాన్ని కోరుకున్న, నాకు విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.