రాఫెల్ డీల్..గుజరాత్ లో దాడులు..రాహుల్ ఫైర్

 

లక్షల కోట్ల రుణాల మాఫీ,నోట్ల రద్దు,జీఎస్‌టీ,రాఫెల్ కుంభకోణం తాజాగా గుజరాత్ లో స్థానికేతరులపై దాడులు..కేంద్రాన్ని ఎండకట్టటానికి రాహుల్ గాంధీ సంధిస్తున్న అస్త్రాలు.రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ తన జీవితంలో ఎప్పుడూ ఒక్క విమానం కూడా తయారు చేయని రూ.45,000 కోట్ల మేరకు బకాయిలు ఉన్న అనిల్ అంబానీకి రాఫెల్ ఒప్పందాన్ని మోదీ కట్టబెట్టారని ధ్వజమెత్తారు.ఒక్కో రాఫెల్ యుద్ధ విమానం ధరను రూ.526 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు ప్రధాని పెంచేశారని ఆరోపించారు.

నిరర్ధక ఆస్తుల వ్యవహారంపైనా రాహుల్ దాడి సాగించారు. దేశంలో అత్యంత సంపన్నులైన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీల వంటి వారికి రూ.3 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత మోదీ సర్కార్‌దేనని అన్నారు.సంస్కరణల పేరుతో తీసుకు వచ్చిన నోట్లరద్దు, జీఎస్‌టీతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు.చిన్న తరహా పరిశ్రమలు,వ్యాపారాలు తూచిపెట్టుకుపోయాయన్నారు.ఆయన తీసుకువచ్చిన సంస్కరణలన్నీ కేవలం 15 నుంచి 20 మంది పారిశ్రామికవేత్తలకే ఉపయోగపడ్డాయని ఆరోపించారు.

గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాల కార్మికులు పెద్దఎత్తున వెళ్లిపోతుండటంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ యువకులపై గుజరాత్‌లో దాడులు చేస్తూ, అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 'ఉద్యోగాలిస్తారని నరేంద్ర మోదీని మీరు నమ్మారు. ఆయన మీ విశ్వాసంపై దెబ్బకొట్టారు' అని అన్నారు.ప్రేమ, ఐకమత్యంతో కూడిన పాలన అందించగలిగిన యూపీఏకు ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు పట్టం కట్టాలని రాహుల్ పిలుపునిచ్చారు.