రాహుల్ దెబ్బకి జగన్ విలవిలా!

 

అత్త కొట్టినందుకు కాదుకానీ తోడికోడలు నవ్వినందుకే ఏడ్చానన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి తీరని రాజకీయ నేతలు ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు. రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా “అసలు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉందా లేదా? ఇంతవరకు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఏమి చేస్తోంది? ప్రధాని మోడీని ఎందుకు నిలదీయలేకపోతోంది? మోడీకి భయపడే వైకాపా నోరు మెదపడంలేదేమో” అని ఘాటుగా విమర్శించారు.

 

ఇంతవరకు అధికార తెదేపా నేతలు తనని రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నావని ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి భరించారు, కానీ రాహుల్ గాంధీ వచ్చి తమ పార్టీ ఏమి చేయడం లేదనేసరికి ఆయన తట్టుకోలేకపోయారు. “గత ఐదేళ్ళుగా కాళ్ళకు చక్రాలు కట్టుకొని ఈకొస నుండి ఆకొస వరకు రాష్ట్రమంతటా కలియ తిరుగుతూ, ఓదార్పు యాత్రలు, ధర్నాలతో ఇంత హడావుడి చేస్తుంటే అదేమీ రాహుల్ గాంధీకి కనబడలేదా?” అని జగన్ ప్రశ్నించారు. అయినా ప్రధాన ప్రతిపక్షంగా తమ పార్టీ ప్రదర్శిస్తున్న చురుకుదనం చూసే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చేరని జగన్మోహన్ రెడ్డి తీర్మానించేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అందరి కంటే ముందుగా స్పందించేది తామేనని చెప్పారు.

 

వారి విమర్శలు, ప్రతి విమర్శల సంగతి ఎలా ఉన్నప్పటికీ వారు చేసే ఈ పాదయాత్రలు, పరామర్శ యాత్రలు, భరోసా యాత్రలు అన్నీ తమ పార్టీలని బలోపేతం చేసుకోవడానికేనని అందరికీ తెలుసు. లేకుంటే చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్నప్పుడు కూడా వారు ఇంత హడావుడి, ప్రచారం చేసుకోకూడదు.

 

మరొక విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదారేళ్ళుగా ఓదార్పు యాత్రలు చేసినా ఎన్నికలలో గెలవలవలేకపోయారు. అటువంటప్పుడు రాహుల్ గాంధీ హడావుడిగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ఒక్కరోజు పాదయాత్రలు చేసి వెళ్ళిపోతే ఏమయినా ఫలితం ఉంటుందా? అంటే ఉండదనే అర్ధమవుతోంది. ఈ సంగతి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలకి కూడా తెలుసు కానీ వారు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేరు ఆపసోపాలు పడుతూ ఆయన వెనుక పరుగులు పెట్టడం తప్ప.

 

కానీ రాహుల్ గాంధీ ప్రత్యేకహోదా విషయంలో వైకాపాపై చేసిన విమర్శలు సహేతుకమయినవేనని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ అంశం గురించి జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలెవ్వరూ కూడా గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. అందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంజాయిషీ మరీ విడ్డూరంగా ఉంది. ప్రత్యేక హోదా గురించి తమ ఎంపీలు పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తున్నారని కనుక దాని గురించి తాము రాష్ట్రంలో పోరాటాలు చేయనవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. “అయినా ప్రతీ అంశం మీద కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా స్పందించడం ఎప్పుడయినా చూసారా? అలాగే నేను కూడా ప్రతీ అంశంపై స్వయంగా స్పందించానవసరం లేదు,” అని సమర్ధించుకొన్నారు.

 

కేంద్ర ప్రభుత్వం పరిష్కరించవలసిన ప్రత్యేకహోదా, రైల్వే జోన్, పోలవరం ఇత్యాది అంశాల గురించి ఆయనెప్పుడు గట్టిగా మాట్లాడకపోయినా, రాష్ట్రంలో రైతుల రుణమాఫీ, రాజధాని భూసేకరణ, పట్టిసీమ, పుష్కారాలు వగైరా అంశాల మీద మాత్రం చాలా తీవ్రంగానే స్పందిస్తుంటారు. కారణం ఏదో ఒకనాడు తెదేపా-బీజేపీలు తెగ తెంపులు చేసుకోవా? అప్పుడు తమకి బీజేపీతో పొత్తులు పెట్టుకొనే అవకాశం రాకపోదా? అనే ఆలోచనయినా కావచ్చు లేదా కేంద్రంతో పెట్టుకొంటే మళ్ళీ తనపై ఈడి, సీబీఐ కేసులు ఊపందుకొంటాయనే భయంవల్ల కావచ్చును. అందుకే రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడినంత ధాటిగా ప్రత్యేకహోదా వంటి అంశాల గురించి ఆయన మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.