కోదండరామ్ కి డిల్లీలో పనేమిటో

 

ఒకవైపు టీ-కాంగ్రెస్ నేతలు నేడోరేపో తెలంగాణా ప్రకటన ఖాయం అంటూ ఒకటే హడావుడి పడిపోతుంటే, మరో పక్క తెరాస నేతలు మరియు తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ మాత్రం ఇదంతా కాంగ్రెస్ మార్క్ ఎన్నికల డ్రామా అని తేలికగా తీసిపారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం తమకు లేదని అంటున్నారు. తన పదేళ్ళ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసుకుపోతుందేమోననే బెంగతో ఉన్న తెరాస నేతలు ఆవిధంగా మాట్లాడటం సహజమే అయినప్పటికీ, తనకు తెలంగాణా సాధన తప్ప రాజకీయాలు ముఖ్యం కాదంటున్న కోదండరామ్ కూడా ఆవిధంగానే మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది.

 

కేసీఆర్ ప్రోద్బలంతో, తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని పైకి ఎదిగిన అనేక మంది నాయకులలో ఆయన కూడా ఒకరు. ఆయనకు కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర స్థాయిలో మంచి పలుకుబడి ఏర్పడింది. గనుక, దానిని ఉపయోగించుకొని పూర్తి స్థాయి రాజకీయాలలో ప్రవేశించి, చక్రం తిప్పాలని ఆయన కూడా సిద్దపడుతునట్లున్నారు. అందుకే తెలంగాణా ఏర్పాటు గురించి మాట్లాడుతున్నటీ-కాంగ్రెస్ నేతలను కాదని, తెలంగాణా ఇస్తామని ఖచ్చితంగా చెపుతున్న బీజేపే నేతలని కూడా పక్కనబెట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణా సాధనకి ఏమాత్రం ఉపయోగపడని జాతీయ నాయకులయిన జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు బిశ్వాస్‌లతో జూలై 4న డిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు. తద్వారా తెలంగాణా సాధన సంగతి ఎలా ఉన్నపటికీ, ఆయన కేంద్ర స్థాయిలో నేతలతో పరిచయాలు పెంచుకొని మరింత బలపడే అవకాశం ఉంది. బహుశః ఈ పరిచయాలు స్నేహాలు, తన రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దుకొనేందుకు కోదండరామ్ కి బాగా ఉపయోగపడవచ్చును.

 

ఆయన కేవలం తెలంగాణా సాధనే తనకు ముఖ్యమని భావిస్తున్నపుడు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణా ఈయదని ధృడంగా విశ్వసిస్తున్నపుడు, తెలంగాణా ఇస్తామని ఖచ్చితంగా చెపుతున్న బీజేపే నేతలని కలవకుండా, తెలంగాణా ఈయలేని ఇతర పార్టీల నేతల్నికలవడం చూస్తే, కోదండరామ్ కి రాజకీయ ఆలోచనలున్నాయని అర్ధం అవుతోంది. ఆయన రాజకీయ నాయకుడు కాడు గనుక, బీజేపీని మతతత్వ పార్టీ అనే వంకతో ఆ పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పడానికి లేదు.

 

తెలంగాణా సాధనకోసం అవసరమయితే బొంత పురుగుని కూడా ముద్దు పెట్టుకొంటానని కేసీఆర్ చెపుతుంటే, కోదండరామ్ జాతీయ పార్టీలయినా కాంగ్రెస్, బీజేపీలను కాదని, ఇతరపార్టీ నేతలతో సమావేశాలు పెట్టుకోవడం కేవలం తన రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నవేనని అర్ధం అవుతోంది. ఈవిధంగా తెలంగాణా అంశం ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజకీయ సోపానంగా మారిపోవడం చాల దురదృష్టకరం.