ఖమ్మం సభకు ప్రియాంక!
posted on Jun 8, 2023 2:15PM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని హస్తం పార్టీ ఇచ్చినా.. కొట్లాడి తెచ్చింది మాత్రం నేనేనంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. అలా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన క్రెడిట్ కొట్టేసి.. వరుస ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్ రాజకీయానికి సంపూర్ణంగా చెక్ పెట్టేందుకు ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీలోని హస్తం పార్టీ నేతల వరకు అంతా ప్రణాళికబద్దంగా పావులు కదుపుతున్నారు.
ఆ క్రమంలో ఈ నెల 25వ తేదీన ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేపట్టింది. అదీకాక ఇదే ఉమ్మడి జిల్లాలోని మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క.. పీపుల్స్ మార్చ్ పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు వస్తారని అంటున్నారు. రాహుల్ వచ్చినా రాకున్నా ప్రియాంకా గాంధీ మాత్రం పక్కాగా ఈ సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.
ఎందుకంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టారు. అదే విధంగా ఈ ఏడాది చివరిలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులోభాగంగా మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో ఈ నెల 12వ తేదీన ఆమె ప్రచార ఘట్టానికి శ్రీకారం చుట్టున్నారని... ఆ క్రమంలో ఖమ్మం వేదికగా జరిగే సభలో పాల్గొంటారని సమాచారం. మరోవైపు ఇదే వేదికపైన .. అదే జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొల్హాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది.
ఇంకోవైపు జూన్ 11 లేదా 12వ తేదీన ఢిల్లీలోని హస్తం పార్టీ అధిష్టానంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు భేటీ అయి.. రాష్ట్రంలో పార్టీ విజయం కోసం అమలు చేయాల్సిన అంశాలు.. అలాగే ప్రజల్లోకి ఏ ఏ అంశాలు బలంగా తీసుకు వెళ్లాలి తదితర అంశాలతోపాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తెలంగాణలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రియాంక గాంధీ సైతం.. తెలంగాణలో పాదయాత్ర నిర్వహించే అవకాశం ఉందనే చర్చ సైతం జరుగుతోంది.
ఇక తెలంగాణలో పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టిన తర్వాత.. పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని.. అందుకు ఆయన చేపడుతోన్న సభలు, బహిరంగసభకు భారీగా ప్రజలు పోటెత్తుతోన్న సంగతి తెలిసిందే. అయితే రానున్న తెలంగాణ ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా మారనున్నాయనేది సుస్పష్టమని తెలంగాణలోని పోటిలికల్ సర్కిల్‌లో చర్చ అయితే ఇప్పటికే ఊపందుకొంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా వరుసగా గెలిచి.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ పాలనకు చెక్ పెట్టి దక్షిణాదిలో.. అదీ తెలంగాణలో పాగా వేసి... తమ సత్తా చాటుకోవాలని బీజేపీలోని కాషాయం పార్టీ నేతలు... తమ వ్యూహాలకు పదును పెడుతూ.. ఈ రాష్ట్రంలో గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు.
అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రాలో పార్టీ పరిస్థితి పాతాళంలోకి పడిపోతోందని తెలిసినా.. తెలంగాణలో మాత్రం అధికారం నిలుపుకుంటామని.. హస్తం పార్టీ అధిష్టానం కలలు కన్నది. కానీ ఆ కలలను... నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కల్లలు చేశారు. దీంతో తమ పార్టీ అధిష్టానం కన్న కలను సాకారం చేసేందుకు తమ వంతు ప్రయత్నాన్ని అయితే హస్తం పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు. మరోవైపు రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో సైతం సత్తా చాటిన తెలుగుదేశం.. 2019 ఎన్నికల్లో మాత్రం అంతగా సత్తా చాట లేకపోయింది. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత.. తెలంగాణలో టీడీపీ సైతం సూపర్ స్పీడ్‌తో సైకిల్ సవారీ చేస్తుంది. ఆ క్రమంలో 2022 డిసెంబర్‌లో తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ఖమ్మం వేదికగా నిర్వహించిన శంఖారావ సూపర్ సక్సెస్ అయింది.
ఆ తర్వాత అంటే 2023, జనవరిలో కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సైతం ఖమ్మంలో భారీ సభ చేపట్టి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. అయితే మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సైతం ఖమ్మం వేదికగా సభ నిర్వహించి.. సత్తా చాటనుంది. మరి అలాంటి వేళ.. కాషాయం పార్టీ నేతలు సైతం....ఖమ్మం వేదికగా.. సభ నిర్వహించినా నిర్వహించవచ్చుననే అభిప్రాయం సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఓ టాక్ అయితే హల్ చల్ చేస్తోంది.
అన్ని పార్టీలు ఇలా ఖమ్మం వేదికగా.. బహిరంగ సభలు నిర్వహించినా.. ఓటర్లు మాత్రం ఒకే ఒక్క పార్టీకే మేజార్టీ స్థానాలు కట్టబెతారనేది సుస్పష్టం. అలాంటి వేళ.. అదీ ఏ పార్టీ అంటే మాత్రం.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడే వరకు వేచి చూడాల్సిందేనన్నది సుస్పష్టం.