రాజకీయనాయకులకి అగ్ని పరీక్షలు..స్వయంకృతాపరాధమే
posted on Jun 30, 2015 1:26PM
రాష్ట్ర విభజన ఉద్యమాలు ఉదృతం అయిననాటి నుండి నేటి వరకు కూడా రెండు రాష్ట్రాలలో పార్టీలున్న రాజకీయనాయకులు ఒక విచిత్రమయిన సమస్య ఎదుర్కోవలసి వస్తోంది. రాష్ట్రానికి చెందిన ఏదో ఒక సమస్య లేదా ప్రయోజనం విషయంలో సదరు పార్టీ వైఖరి ఏమిటని నిలదీయడమనే సరికొత్త పద్దతిని రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టాయి. రాష్ట్ర విభజన తరువాత రెండు ప్రభుత్వాల మధ్య తలెత్తుతున్న సమస్యలు, వివాదాలలో ప్రత్యర్ధి పార్టీని నిలదీసేందుకు ఇది ఒక గొప్ప ఆయుధంగా మారిందిప్పుడు. కానీ కేవలం తెలంగాణా రాష్ట్రానికే పరిమితమయిన తెరాసకు అదే ఒక వరంగా మారింది.
రెండు రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, తెదేపా, వైకాపాలకు నిత్యం ఈ గడ్డు సమస్య ఎదురవుతూనే ఉంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో కొనసాగుతున్న విద్యుత్, జల వివాదాలలో తెలంగాణా తెదేపా నేతల వైఖరి ఏమిటో తెలపాలని తెరాస నిలదీస్తుంటుంది. సెక్షన్: 8ని అమలుచేయాలని ఏపీ తెదేపా నేతలు డిమాండ్ చేస్తుంటే, తెలంగాణా తెదేపా నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్న తెరాస, దానిపై మీ వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకంపై కూడా వారి వైఖరి తెలియజేయాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసారు.
ఆంద్రప్రదేశ్ లో తెరాస ప్రభుత్వానికి అనధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కూడా తరచూ ఇటువంటి అగ్నిపరీక్షలే ఎదురవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు మొదలు సెక్షన్: 8 అమలు వరకు వైకాపా ఎందుకు స్పందించడం లేదు? అని తెదేపా నేతలు విమర్శిస్తుంటే, ఆయన తెలివిగా ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వగైరా అంశాల మీద కేంద్ర ప్రభుత్వాన్ని తెదేపా ఎందుకు నిలదీయడం లేదు? కేంద్ర ప్రభుత్వంలో మీ మంత్రులను ఎందుకు రాజీనామా చేయించడం లేదు? అని ఎదురు ప్రశ్నిస్తుంటారు.
అధికార తెదేపా, తెరాసలు కానీ వైకాపా గానీ ఈ గొడవలోకి కాంగ్రెస్ పార్టీని లాగాలని చూడకపోవడం చాలా ఆశ్చర్యమే. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ‘వైఖరి’ ప్రకటన రొచ్చులో ఇరుకోక్కుండా చాలా తెలివిగా కాలక్షేపం చేసేస్తోంది. వివిధ అంశాలు సమస్యలు ఎదురయినప్పుడల్లా రెండు రాష్ట్రాలలో పార్టీలున్న రాజకీయ నాయకులకి ఈ అగ్నిపరీక్షలు ఎదుర్కోవలసి వస్తోంది. బహుశః ఇది శాశ్విత సమస్యే అని చెప్పవచ్చును. పరిపాలనలో రాజకీయాలను మిళితం చేయాలని చూస్తే ఇటువంటి సమస్యలే ఎదుర్కోవలసి వస్తుంది. రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు సృష్టించుకొన్న ఈ విషవలయంలో చివరికి వారే చిక్కుకొంటున్నారు.