జమిలీ వెనుక మెయిన్ రీజన్...మోడీ ఏజ్ ఫ్యాక్టర్ ?

మోడీ రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత ఒక అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతీ పార్టీ అధ్యక్షుడ్ని ఆహ్వానించారు. మొత్తం ఐదు అంశాలు ఎజెండాగా చెప్పినప్పటికీ అసలు విషయం మాత్రం జమిలీ ఎన్నికలు అనేది అప్పటికే అందరికీ అర్ధం అయ్యే ఉంటుంది.  ఒకే దేశం - ఒకే ఎన్నికలు అనే నినాదాన్ని భాజపా చాలా కాలంగా వినిపిస్తోంది. వాస్తవానికి జమిలి ఎన్నికలు నిర్వహణ మీద గతంలోనూ బిజెపి పాలనలోనే న్యాయశాఖ 1999లో జమిలికి జై కొట్టగా 2015లో పార్లమెంటు స్థాయి కమిటీ కూడా జమిలికి మద్దతుగా ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది. 

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సగానికి సగం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేసిజమిలీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. అందు కోసం సాధ్యాసాధ్యాల పరిశీలనకు లా కమిషన్‌ను కూడా నియమించారు. ఆ కమిషన్ అన్ని పార్టీల దగ్గర్నుంచి అభిప్రాయాలు తీసుకుంది. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే  ఎదురయ్యే సవాళ్లు అధిగమించాల్సిన మార్గాలతో నివేదిక సిద్ధం చేసింది. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని వ్యతిరేకించే ప్రతీ పార్టీ జమిలీ ఎన్నికలను అంగీకరించలేదు. అందుకే జమిలీ లేకుండానే మొన్నటి ఎన్నికలు అయిపోయాయి. 

అయితే గతంలో జమిలీ ప్రతిపాదన వచ్చినప్పుడు లా కమిషన్ ముందు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ , టీడీపీ, బీఎస్పీ సహా పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ ఇప్పుడు కొన్ని పార్టీలు జమిలీ ఎన్నికలను స్వాగతించక తప్పని పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జమిలీ ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. లా కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు.  అయితే ఇక్కడ అసలు విషయం ఇప్పుడు బయటకి వస్తోంది. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి మూడేళ్లలో కసరత్తు పూర్తి చేసి రెండేళ్ల ముందే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

అంటే 2022లో జమిలీ ఎన్నికలు పెట్టొచ్చు. ఆ ఏడాది దాదాపుగా ఎనిమిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఏడాది మరో ఐదు రాష్ట్రాలకు జరగాల్సి ఉంది. 2021లో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటన్నింటినీ కలిపేసి.. 2022లో పెట్టడానికి.. బీజేపీ అంతర్గత కసరత్తు చేస్తోందని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. జమిలీని పెడితే ఎలాంటి సమస్యలు వస్తాయన్న విషయాల మీద అనేక రకాలుగా పరిశీలన జరుపుతున్నారు అగ్రనేతలు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రప్రభుత్వాల కాలపరిమితి తగ్గించాలి లేదా పెంచాలి. అలా చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. 

అందుకే ఆ ప్రయత్నాలకి ఇబ్బంది కలగకుండా రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి రెండేళ్ల ముందే ఈ సారి ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యరం లేదని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి దీని వెనుక మోడీ బుర్ర ప్రధానం అని తెలుస్తోంది ! కానీ ఎందుకయ్యా అంటే, తాజాగా బీజేపీ పెద్దలు కొత్త రూల్ ఒకటి తెచ్చారంట. దాని ప్రకారం బీజేపీలో 75 ఏళ్ల పైబడిన ఎవరికీ టిక్కెట్లు ఇవ్వరట. అందుకే మొన్నటి ఎన్నికల్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా లాంటి వాళ్ళని ఇళ్లకే పరిమితం చేశారు. 

అయితే ఇప్పుడు ఇదే రూల్ మోడీ తలకు చుట్టుకునేలా ఉంది. అది ఎలా అంటే ప్రస్తుతం మోడీ వయసు 68, ఆయన లెక్క ప్రకరం మళ్ళీ పోటీ చేస్తే వచ్చే వయసు 73 ఏళ్ళు, అప్పటికి టికెట్ వచ్చినా ఆయనని ప్రధాని పదవి నుండి తప్పుకోమని ఆర్ఎస్ఎస్ అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే గడ్కరీ లాంటి నేతలను లైన్ లోకి తెస్తున్న ఆ సంస్థ మళ్ళీ మోడీ అంటే ఇబ్బంది పెట్టచ్చు. అందుకే ఆ అవకాశం ఇవ్వకుండా   2022లో జమిలీ పెడితే ఇంకా నాలుగేళ్ళు ఉంటుందనే కారణంతో మోడీ మళ్ళీ ప్రధాని కావచ్చు. అలా మూడు సార్లు ప్రధానిగా పని చేసి అప్పుడు తప్పుకోవచ్చనేది ఆయన యోచనగా చెబుతున్నారు విశ్లేషకులు. అయితే ఇందులో నిజం ఎంతుందో తెలీదు కానీ ఒక్క మనిషి అధికారం కోసం ఇంత చేయడం దేనికి సంకేతమో మరి ?