మయన్మార్ అధ్యక్షుడితో మోడీ భేటీ

 

మూడు దేశాల్లో పది రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం నాడు మయన్మార్ రాజధాని నేపిడా చేరుకున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు యు ధేన్ సేన్‌తో భేటీ అయ్యారు. సాంస్కృతిక, వాణిజ్య రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి, రెండు దేశాల మధ్య అనుసంధాన్ని విస్తృతం చేసుకోవడం గురించి తామిద్దరం చర్చించుకున్నామని నరేంద్రమోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతకుముందు నేపిడాలో మోడీకి ఘన స్వాగతం లభించింది. బాలబాలికలు సంప్రదాయ దుస్తుల్లో ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ పర్యటనలో భాగంగా మోడీ మయన్మార్‌లో జరగనున్న ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఏసియాన్) - భారత శిఖరాగ్ర సదస్సులో, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహించనున్న జి-20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఈ మూడు అంతర్జాతీయ సదస్సుల సందర్భంగా మోడీ 40కి పైగా అంతర్జాతీయ నేతలతో సమావేశం కానున్నారు. ఏసియాన్ సదస్సు ఈ నెల 12, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు 13న, జి-20 సదస్సు ఈనెల 15, 16 తేదీల్లో జరగనున్నాయి. మోడీ ఈనెల 18న ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో భేటీ అవుతారు. ఈనెల 19వ తేదీన ఫిజి దేశానికి వెళ్తారు.