చెట్టుకు పోలీసుల కాపలా..ఏడాదికి 12 లక్షల ఖర్చు..ఎందుకిలా..?

మామూలుగా వీఐపీలనో లేక చారిత్రక భవనాలనో కాపాడటానికి ప్రభుత్వాలు ఏటా కోట్లు ఖర్చు పెడుతుంటాయి. అలాంటిది ఒక చెట్టు కోసం ఏడాదికి లక్షలు ఖర్చు చేస్తే..ఇంతకి అంత అవసరం ఏమొచ్చింది అంటారా...? మధ్యప్రదేశ్‌లోని సల్మత్‌పూర్ ప్రాంతానికి ఐదేళ్ల క్రితం అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్షే వచ్చారు.. తాను ఆ ప్రాంతాన్ని సందర్శించినందుకు గుర్తుగా భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే రావి చెట్టును నాటారు..ఇంకేముంది అది వీవీఐపీ చెట్టుగా మారిపోయింది. ఈ జ్ఞాపకాన్ని పదిలంగా ఉంచడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. దీని సంరక్షణకు ప్రత్యేక వాటర్ ట్యాంక్..పురుగులు పట్టకుండా, వాడిపోకుండా ఉండటానికి ప్రత్యేక ఉద్యానవన నిపుణుడిని ఏర్పాటు చేశారు. ఈ చెట్టు చెట్టు ఇనుప కంచె వేసి 365 రోజులు పోలీసు పహారాను కూడా ఉంచారు.. వీటన్నింటికి కలిపి ఏడాదికి రూ.12 లక్షలు ఖర్చవుతోందట. అయితే రాష్ట్రంలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే చెట్టు కోసం లక్షలు ఖర్చు చేయడంపై పలువురు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.