దిల్లీలో అవిశ్వాసం… ట్విట్టర్‌లో జనసేనాని అయోమయం!

ఏపీ పాలిటిక్స్ లో చంద్రబాబువి తెలివైన రాజకీయాలు. జగన్ వి ఆవేశపూరిత రాజకీయాలు. ఇక పవన్‌వి ఆశ్చర్యకర రాజకీయాలు! ఆయన ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తారో, ఎవరికి గౌరవం ఇస్తారో, ఎవర్ని బతిమాలతారో, ఎవర్ని తిట్టిపోస్తారో ఆయనకే తెలియదు! అవిశ్వాస తీర్మానం నేపథ్యంలోనూ పవర్ స్టార్ ట్వీట్ల రాజకీయం మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలింతకీ కళ్యాణ్ బాబు కథ ఏంటి, కథనం ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి అనేలా వ్యవహారం నడిచింది!

 

 

గత వారం రోజులుగా ఏదైనా అంశం తీవ్ర దుమారం రేపుతోంది అంటే… అది అవిశ్వాసమే! కేంద్రంపై టీడీపీ సంధించిన బలపరీక్ష అస్త్రం కలకలమే రేపుతోంది. లాభ, నష్టల మాట ఎలా వున్నా ఏపీకి జరిగిన అన్యాయం జాతీయ స్థాయిలో చర్చకొచ్చింది. ఒక విధంగా మోదీ బోనులో నిలబడాల్సిన స్థితి వచ్చింది. టీడీపీ ఇంత వరకైనా సక్సెస్ అవుతుంటే జగన్ తన ఎంపీల చేత రాజీనామాలు చేయించి అస్త్ర సన్యాసానికి పాల్పడ్డారు. ఆయనకంటే తెలివైన వారు పవన్ కళ్యాణ్! అసలు ఈయన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న శుక్రవారం ఉదయం వరకూ నిద్రలేవలేదు! అవిశ్వాసం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు! జనసేన అనే ఒక పార్టీనే ఏర్పాటు చేసుకుని జనంలో తిరుగుతోన్న నాయకుడు ఇంత బాధ్యత రాహిత్యంతో వుండవచ్చా? హోదా గురించి ప్రజలు ఎంతో సీరియస్ గా వుంటే అది సమస్యే కాదన్నట్టు తన యాత్రలు, పర్యటనలు, కవాతులు తాను చేసుకుంటున్నారు పవన్. ఇక తప్పదన్నట్టు అవిశ్వాసం సభలో జరగనున్న నాటి ఉదయం రెండు మొక్కుబడి ట్వీట్లు చేసి ఊరుకున్నారు! అందులోనూ తనదైన శైలిలో గందరగోళ వ్యాఖ్యానం చేశారు జనసేనాని!

 

 

గుర్తుందిగా… ఇదే గబ్బర్ సింగ్ గతంలో అనంతపురం, కాకినాడ సభల్లో కాషాయ పార్టీని కడిగిపారేశారు. కానీ, ఇప్పుడు తాను కావాలన్న హోదా విషయంలోనే టీడీపీ పూర్తి స్థాయి యుద్ధం చేస్తుంటే … సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు! పవన్ తన ట్వీట్స్ లో స్వీట్ గా ఇలా చెప్పారు. బీజేపీ పెద్దలకు టీడీపీ పెద్దలతో ఏవైనా గొడవలుంటే ప్రత్యేక హోదాని పణంగా పెట్టవద్దట! ఇదేం చోద్యం? టీడీపీ నాయకత్వానికి బీజేపీ నేతలతో వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు ఏముంటాయి? పవన్ కే తెలియాలి.

 

 

ఇక ఇంకో ట్వీట్ లో పవన్ టీడీపీ, బీజేపీలు రెండూ డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. టీడీపీ హోదా ఇవ్వమని పట్టుబట్టి అవిశ్వాస తీర్మానం దాకా వ్యవహారాన్ని లాక్కొస్తే నాటకాలు ఏమున్నాయి? మోదీని నేరుగా విమర్శిస్తోంటే ఇంకేం కావాలి? జగన్ తో బాటూ పవన్ ఈ మధ్య కాలంలో మోదీని పల్లెత్తు మాట అనటం మీరెప్పుడైనా చూశారా? కానీ, మన అజ్ఞాత వాసికి అన్ని రిస్క్ లు తీసుకుంటోన్న టీడీపీ కూడా బీజేపీకి తోడు దొంగలా కనిపిస్తోందట!

 

 

ఆ మధ్య ఏవో పెన్ డ్రైవ్ లు దొరికాయని వార్తలు రావటమే తప్ప వాటి గురించి, అవ్వి పవన్ పంథాపై చూపుతోన్న ప్రభావం గురించి అధికారికంగా ఏం తెలియటం లేదు. కానీ, పవన్ బీజేపీని సాద్యమైనంత తక్కువ టార్గెట్ చేసీ… మోదీని ఒక్క మాటైనా అనకుండా వుంటూ… టీడీపీని బోనులో నిలబెడుతుండటం చూస్తే… పెన్ డ్రైవ్ గాసిప్స్ నిజమేనేమో అనిపిస్తోంది! దిల్లీ పెద్దలు జగన్ని సీబీఐ ద్వారా, పవన్ని పెన్ డ్రైవ్ ద్వారా రిమోట్ కంట్రోలింగ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది!