ముద్రగడ పవన్‌ని అంత మాటనేశాడేంటీ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు ముమ్మరం చేశారు. రాజకీయ నిరుద్యోగులుగా వున్నవారికి ఆయన ఇప్పుడు కల్పవృక్షంలా కనిపిస్తున్నారు. అలాంటి వారందరూ ఇప్పుడు జనసేన నీడన చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఏ పార్టీకి సన్నిహితంగా వుండాలా అని ఎదురుచూస్తున్న ఉండవల్లి, జయప్రకాష్ నారాయణ లాంటి వారు కూడా పవన్ కళ్యాణ్‌కి చేరువవుతున్నారు. వాళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్‌ని కలసి మంతనాలు జరిపారు. ఇద్దరు ప్రముఖులు తమ నాయకుడికి చేరువ కావడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమాన జనాలు, జనసేన కార్యకర్తలు హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే ఇలా హ్యాపీగా ఫీలవటం సూది దొరికిందన్న ఆనందంలో గడ్డపలుగు పోయిందనే విషయాన్ని పట్టించుకోనట్టుగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 

ఇద్దరు ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కి దగ్గరవుతున్నారు ఓకే.. బాగానే వుంది.. కానీ మరో ప్రముఖుడు పవన్ కళ్యాణ్‌కి దూరమవుతున్నారు.. ఆ విషయాన్ని జనసేన వర్గాలు లైట్‌గా తీసుకుంటున్నాయి. ఎవరు అవునన్నా, కాదన్నా పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని తన ప్రధాన బలంగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతుదారుల్లో ఆ సామాజికవర్గానికి చెందిన వారి సంఖ్య చాలా ఎక్కువ. గతంలో ఈ సామాజికవర్గం వారు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ మీద ఆశలు పెట్టుకుని భంగపడ్డారు. ఇప్పుడు పవన్ మీద ఆశలు పెట్టుకున్నారు. గతంలో మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా తమను భంగపడేలా చేస్తాడా అనే అనుమానాలు వీరిని బలంగా పీడిస్తున్నాయి.

 

అలా అనుమానిస్తూనే, పవన్ వెంట నడుస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ కంటే సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని కలుపుకుని వెళ్ళడంలో పవన్ కళ్యాణ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ముద్రగడ పవన్ కళ్యాణ్‌తో కలసి నడవటానికి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇటీవల ఒక బలమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాపులకు పవన్ కళ్యాణ్ వల్ల ఒరిగేదేమీ వుండదని, కాపులకు పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబే న్యాయం చేస్తారన్న నమ్మకం వుందని ముద్రగడ ప్రకటించారు. ముద్రగడ చేసిన ఈ ప్రకటన కాపు సామాజిక వర్గం మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్‌కి, జనసేన వర్గాలకి ఇంకా అర్థమైనట్టు లేదు.