పళనిస్వామి వస్తే ఏం లాభం?

 

ఎట్టకేళకు తమిళనాడు రాజకీయాలకు కాస్త కొలిక్కి వచ్చాయి. శశికళ వీరవిధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటూ గవర్నరు ఆహ్వానించడంతో ఆ కుర్చీకి కొత్త కళ వచ్చింది. సచివాలయానికి చేరుకుందామనుకున్న శశికళ సెంట్రల్‌ జైలుకి చేరుకోవడంతో.. ముఖ్యమంత్రి పీఠం మీద ఆసక్తి నెలకొంది. ఈ వివాదం మీద ఇప్పటివరకూ ఆచితూచి వ్యవహరిస్తున్నా గవర్నరు న్యాయనిపుణుల సలహాతో ఇప్పుడు ఇహ పళనిగారిని ఆహ్వానించక తప్పలేదు.

 

తమిళ రాజకీయాలలో పళనిస్వామిది ఓ ప్రముఖ పాత్ర. ఎంజీఆర్‌ చనిపోయిన తరువాత జయకి అండగా నిలిచిన అతికొద్దిమంది నేతలలో పళని ఒకరు. అలా అన్నాడీఎంకేలో ఆయనది దాదాపు 30 ఏళ్ల ప్రస్థానం. రైతు కుటుంబంలో జన్మించినా, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభుత్వంలోనే ఎన్నదగిన నేతలలో ఒకరుగా నిలిచేవారు. ప్రస్తుతానికి రహదారులు, నౌకాయానాల శాఖ మంత్రిగా అధికారం చెలాయిస్తున్నారు. ఇంత అనుభవం ఉంది కాబట్టి తమిళమార్కు రాజకీయాలలో పళని పండిపోయారని ఒప్పుకోక తప్పదు.

 

నిజానికి జయలలిత చనిపోయిన వెంటనే ఆ స్థానంలో పళనిస్వామిని కూర్చోపెట్టాలని శశికళ భావించారు. అయితే అత్యధిక శాసనసభ్యులు దీనికి నిరాకరించడంతో పన్నీర్‌ను నిలబెట్టక తప్పింది కాదు. తనకి దక్కని ముఖ్యమంత్రి పదవి శశికళకైనా దక్కాలని పళని చేయని ప్రయత్నం అంటూ లేదు. అందుకోసమే ముఖ్యమంత్రి పదవి అంటే ఏమాత్రం ఆశ లేదని చెప్పిన శశికళను అదే పదవి కోసం వెంపర్లాడేలా ఎగదోశారు. ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా గోల్డెన్‌ బే రిసార్టులకు తరలించడంలోనూ ఆయనది ముఖ్యపాత్రని చెబుతారు. ఊహించని రీతిలో ఇప్పుడు శశికళ చిప్పకూడు తినక తప్పకపోవడంతో, ఆమెకు తోడుగా నిలిచిన పళని తెర మీదకు వచ్చాడు. తన బదులు పళనిని ముఖ్యమంత్రి పీఠం మీద నిలపడంలో అటు శశికళ పంతమూ నెగ్గినట్లయ్యింది.

 

నిజానికి తమిళనాట రాజకీయాలు ఎప్పుడోనే బ్రష్టుపట్టిపోయాయి. ద్రవిడ ఉద్యమంతో తమిళజాతిని తలెత్తుకునేలా చేసిన నాయకుల వారసులు ఇప్పుడు వ్యక్తిగత పూజలందుకునేందుకు తొందరపడుతున్నారు. అవినీతి, కుటుంబ పాలన, ఆడంబరం, కుతంత్రాలు, హత్యారాజకీయాలతో అక్కడి నేతలు ఎప్పుడోనే నీతులు తప్పారు. మరి ఆ తరహా రాజకీయాలకు పళనిస్వామి ఏ రంగు పులుముతారో చూడాలి. జైల్లో ఉన్న శశికళ మనసుని ఎరిగి ఆమె కనుసన్నలలోనే నడుచుకుంటారా? తనదైన శైలిలో విచక్షణాయుతంగా పాలన సాగిస్తారా? మిగిలిన పాలనాకాలాన్ని తూతూమంత్రంగా లాగించేస్తారా? అన్న ప్రశ్నలకు త్వరలోనే ఓ జవాబు రానుంది.

 

ఒకటి మాత్రం నిజం! మురికిపట్టిన తమిళరాజకీయాలు మళ్లీ కోలుకోవాలంటే చాలాకాలమే పడుతుంది. అది తమిళుర చేతుల్లోనే ఉంది. సాధారణంగా తమిళురకు స్వాభిమానం ఎక్కువ. తమ భాషని కాపాడుకునేందుకు వారు ఉద్యమిస్తారు, జల్లికట్టు వంటి ఆచారాన్ని కాపాడుకునేందుకూ వారు ఉద్యమిస్తారు. మరి తమ నేతల విషయంలో ఎందుకని వారు చూసీ చూడనట్లు ఊరుకుంటున్నట్లు? స్వాభిమానం ఉన్నచోట శృతిమించిన వ్యక్తిపూజలు ఎలా సాధ్యమయ్యాయి? ఈ ప్రశ్నలు కనుక వారిలో మెదిలితే తమిళనాట మార్పు రాక మానదు!!!