ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో కుల రాజకీయాలు... పేరు మార్చుతారన్న ప్రచారంపై కలకలం...

ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రెండు సామాజిక వర్గాల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది. దాంతో ఎవరు అధికారంలోకొస్తే, వాళ్లు తమ వర్గానికి పెద్దపీట వేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. చంద్రబాబు హయాంలో తన సామాజిక వర్గానికే ప్రతిచోటా కీలక పదవులను కట్టబెట్టారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది కూడా టీడీపీ ఘోర పరాజయం పాలవడానికి కారణాల్లో ఒకటని అంటారు. ఇక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో... రెడ్డి కమ్యూనిటీకి పెద్దపీట వేస్తున్నారనే మాట వినిపిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50శాతం కోటా అంటూ చట్టం తెచ్చినప్పటికీ, కీలక పదవుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకే పెద్దపీట దక్కుతుందనేది ఆరోపణ. అయితే, ఈ కుల రాజకీయాలు... విశ్వవిద్యాలయాల్లో కూడా అలజడి సృష్టిస్తున్నాయట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక వైద్య విశ్వవిద్యాలయంలో ఇఫ్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో, ఆ సామాజికవర్గ ప్రముఖులు.... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో పాగా వేయడానికి సిద్ధమయ్యారట. అందులో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ సీవీరావును తప్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారట. దాంతో ఎందుకొచ్చిన తలపోటని సీవీరావు రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఇష్యూ... సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో అతిత్వరలోనే, వీసీ సీవీరావును తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు స్వయంప్రతిపత్తి కలిగిన వైద్య విశ్వవిద్యాలయంపై వైద్యారోగ్యశాఖ ముఖ్య అధికారి అప్పుడే తనదైన శైలిలో పెత్తనం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ముందు పెద్ద తలకాయలను తప్పిస్తేనే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో తాము అనుకున్నది చేయగలుతామని నిర్ణయానికి వచ్చిన జగన్ సామాజికవర్గ నేతలు, అధికారులు.... ముందుగా వీసీని వెంటనే తప్పించాలని జగన్ పై ఒత్తిడి పెంచారట. అంతేకాదు, అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాలని సీఎం దగ్గర ప్రతిపాదన పెట్టినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తొలగించాలని జగన్ సామాజికవర్గం డిమాండ్ చేస్తోందట.

అయితే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో కుల రాజకీయాలపై అక్కడి అధికారులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. మూడేళ్ల పదవీ కాలానికి ఎన్నికైన సీవీరావును వీసీగా తప్పిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇక, యూనివర్శిటీ పేరు మార్చుతారన్న ప్రచారంపైనా ఉద్యోగులు ఫైరవుతున్నారు. ఎన్టీఆర్ పేరును తొలగిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు.