సచిన్ కోసం చకచక ఏర్పాట్లు...
posted on Nov 14, 2014 8:58AM

సచిన్ టెండూల్కర్ ఈనెల 16వ తేదీన నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామానికి రానున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పిలుపుకు స్పందించి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం నాడు సచిన్ టెండూల్కర్ ప్రతినిధులు మనోజ్, నారాయణ పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. 16వ తేదీన సచిన్ ఈ గ్రామానికి వస్తున్న విషయాన్ని వెల్లడించారు. సచిన్ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఎవరెవరిని కలవాలి? ఏయే కార్యక్రమాలు ప్రారంభించాలి? అనే విషయాలను సచిన్ ప్రతినిధులు పరిశీలించారు. తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని పరిశీలించడానికి మాత్రమే సచిన్ వస్తున్నారని, సచిన్ రాక సందర్భంగా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రామాన్ని సందర్శించడం మినహా ఆయన వేరే ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం గానీ, గ్రామానికి సంబంధించని వారిని కలవటం గానీ చేయరు. సచిన్ ఈ గ్రామం మొత్తాన్నీ కాలి నడకన తిరుగుతారు. గ్రామం మొదట్లో శంకుస్థాపన కార్యక్రమం తర్వాత నూతనంగా నిర్మితమవుతున్న కంపోస్టు యార్డు, ఆటస్థలం, చెరువును సచిన్ టెండూల్కర్ పరిశీలిస్తారు. సచిన్‌ను కలిసే గ్రామస్తులను జేసీ ఆయన ప్రతినిధులకు చూపారు. మరుగుదొడ్డి నిర్మించుకున్న ఒక కుటుంబాన్ని, ప్రహరీ గోడ కట్టుకున్న మరో కుటుంబాన్ని ఆయన కలుస్తారు. పాఠశాలను ప్రారంభిస్తారు. డ్వాక్రా మహిళలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకుంటారు. స్థానిక విద్యార్థులతో కొంతసేపు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. గ్రామంలోని రచ్చబండ వద్ద స్టేజి ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి సచిన్ గ్రామస్తులతో నేరుగా మాట్లాడుతారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొంటారు.