విమానంలో గవర్నర్ ఉన్నప్పటికీ...
posted on Mar 30, 2015 2:54PM
సోమవారం ఉదయం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించారు. శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది నిర్లక్ష్యం, వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. వివరాల ప్రకారం సోమవారం ఉదయం మూడు రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్ నరసింహన్ ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి బయల్దేదారు. ఫ్లైట్ గాలిలోకి ఎగిరి కొంత దూరం ప్రయాణించిన తరువాత, ప్రయాణికుల లగేజ్ లోడ్ చేయలేదని.. వెంటనే వెనక్కి రావాలని పైలట్ కు సమాచారం అందించారు. అరగంట ప్రయాణించిన విమానాన్ని మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. లగేజ్ లోడ్ చేసిన అరగంటకు మళ్లీ విమానం బయల్దేరింది. అయితే ఒక గవర్నర్ ప్రయాణిస్తున్న విమానాన్ని ఇలా వెనక్కి రప్పించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ సంఘటనపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.