కేసీఆర్ కి అప్పుడే జ్వరం వచ్చేసిందా? లోకేష్ ప్రశ్న
posted on Jun 30, 2015 9:50PM
తెదేపా యువనేత నారా లోకేష్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా ఘాటయిన వ్యాఖ్యలు చేసారు. “ఏదయినా తెగే వరకు లాగకూడదు. కానీ ఒకవేళ మాకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం అంతగా ఉబాలాటపడుతుంటే మేమూ కాదనము. మాకు నోటీసులు ఇస్తే మా నెత్తిన పాలు పోసినట్లే భావిస్తాము. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మెడకి ఉచ్చు బిగుసుకొంటుంటే దానితో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను తెలంగాణా ప్రభుత్వం ఒకరొకరిగా మార్చేస్తోంది లేదా దీర్ఘ కాలిక శలవు మీద పంపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ తో తమకు సంబంధం లేదనుకొంటే తెలంగాణా హోంశాఖ కార్యదర్శిని ఇంత అకస్మాత్తుగా మార్చడం ఎందుకు? రేవంత్ రెడ్డి కేసును చూస్తున్న ఇంటెలిజన్స్ చీఫ్ అకస్మాత్తుగా దీర్ఘాకాలిక సెలవుపై ఎందుకు వెళ్లారు?” అని లోకేష్ ప్రశ్నించారు.
“చంద్రబాబు నాయుడుకి ఎదురు పడలేకనే కేసీఆర్ జ్వరం సాకుతో గవర్నర్ ఇచ్చిన విందుకు మొకం చాటేశారు. ఇన్ని రోజులు బాగానే ఉన్న కేసీఆర్ కి అకస్మాత్తుగా జ్వరం వచ్చేసింది,” అని లోకేష్ ఎద్దేవా చేసారు.
“తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల స్థాపించేందుకు నూతన పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకొంటున్న తెలంగాణా ప్రభుత్వం ఎప్పటి నుండో తెలంగాణాలో ఉండి వేల కోట్ల టర్నోవర్ చేస్తున్న హెరిటేజ్ సంస్థని తెలంగాణా నుండి వెళ్ళగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే కేసీఆర్ వైఖరిని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు,” అని లోకేష్ విమర్శించారు.