లోకేశ్.. ఇలా అయితే ఎలా

తన తర్వాత తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చేయాలని ఎంతో కష్టపడుతున్నారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్‌ని 2019 వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురాకూడదని భావించారు చంద్రబాబు.  కానీ పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించి కేబినెట్‌లోకి తీసుకున్నారు. తద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు దగ్గరి నుంచి చూసే అవకాశాన్ని కల్పించారు సీఎం. చాలా తక్కువ టైంలో.. అతి చిన్న వయసులో మంత్రి హోదాలోకి వచ్చిన లోకేశ్‌కి అనుభవలేమో.. కొంచెం కంగారు పడుతున్నారో తెలియదు కానీ వేదికల మీద.. ప్రెస్ మీట్లలోనూ కాస్త తడబడుతున్నారు.

 

మొన్నామధ్య బీఆర్ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు.. అయితే అంబేద్కర్ జయంతిని పొరపాటున వర్థంతిగా పేర్కొనడంతో సోషల్ మీడియా హోరేత్తిపోయింది. ఇలా ఒకటి కాదు ఎన్నో అంశాల్లో లోకేశ్ తడబాట్లు తెలుగుదేశానికి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ప్రత్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. ఈ వివాదాలతో పాఠం నేర్చుకున్న చినబాబు ఇటీవలి కాలంలో కాస్త ఆచితూచి స్పందిస్తున్నారు. తాజాగా 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మూడు సంవత్సారాలకు కలిపి ఒకేసారి ఇవ్వడం.. ఒక సామాజిక వర్గానికే పెద్దపీట వేయడం.. ఒకే సినిమాకు తొమ్మిది అవార్డులు ఇవ్వడంపై పెద్ద దుమారం రేగింది.

 

అది కాస్త సద్దుమణుగుతున్న సమయంలో లోకేశ్ ఎంట్రీ ఇవ్వడం అగ్నికి ఆజ్యం పోసింది. ఏపీలో ఓటరు కార్డు.. ఆధార్ కార్డ్ లేని వారే నంది అవార్డులపై రచ్చ చేస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్‌ పలువురు సినీ ప్రముఖులకి ఆగ్రహం తెప్పించింది. ఈ దేశంలో ఎవరిపై విమర్శలు చేయాలన్నా ఆ ప్రాంతంలో ఆథార్ కార్డులు, రేషన్ కార్డులు ఉండాలా..? మరి మీ ఆస్తులన్నీ.. చివరికి సొంతిల్లు కూడా హైదరాబాద్‌లోనే ఉంది కదా..? అంటూ పలువురు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.

 

వీటన్నింటిని గమనిస్తున్న సగటు తెలుగుదేశం కార్యకర్త ముఖం మాడిపోతోంది.. ముఖ్యమంత్రి లాంటి ఉన్నత హోదాలోకి వెళ్లబోయే వ్యక్తికి రాజ్యాంగాలు, చట్టాలు తెలియాల్సిన అవసరం లేదు..? కనీస విషయ పరిజ్ఞానం ఉంటే చాలు అంటున్నారు. మనం ఒక వేలు ఇతరుల పైకి చూపిస్తే.. మిగిలిన నాలుగు వేళ్లు మనవైపే చూస్తాయని గుర్తించాలని.. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచించి మాట్లాడాలని రాజకీయాల్లో ఉన్నవారు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలని వారు అంటున్నారు.