ఎస్.ఐ. సిద్ధయ్య కన్నుమూత

 

నల్లగొండ జిల్లా జానకిపురంలో తీవ్రవాదులతో పోరాడి తీవ్రంగా గాయపడిన ఆత్మకూర్ (ఎం) ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య (29) మృత్యువుతో జరిగిన పోరాటంలో ఓడిపోయారు. హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం మరణించారు. సిద్ధయ్య మరణించినట్టు కామినేని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం సిద్ధయ్య ఆరోగ్యం విషమంగా వుందని డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన మరణించినట్టు ప్రకటించారు. సిద్ధయ్య మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సిద్ధయ్య మరణవార్త నల్లొండ జిల్లా పోలీసులను కలచివేసింది. దుండగులు జరిపిన కాల్పుల్లో సిద్ధయ్య శరీరంలో 4 బుల్లెట్లు దూసుకుపోయాయి. 10 మందితో కూడిన వైద్య బృందం ఇప్పటి వరకు సిద్ధయ్యకు 3 శస్త్రచికిత్సలు చేసి బుల్లెట్లను తొలగించింది. అయితే మెదడులో వున్న బుల్లెట్‌ని తొలగించలేదు. కడుపులో కూడా ఒక బుల్లెట్ ఉండిపోయింది. ఇంత తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య చివరకు కన్నుమూశారు.