కడప జిల్లాలను వణికిస్తున్న గుంతలు
posted on Nov 30, 2015 11:17AM

కడప జిల్లాలోని పలు గ్రామాలలో గత కొద్ది రోజులుగా భూమి కుంగి పెద్ద పెద్ద గుంతలు పడడంతో ఆ గ్రామాలలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. అదేంటి గుంతలు పడితే భయపడాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు సమస్య..ఈ గుంతలు మాములు స్థాయిలో పడడటం లేదు. ఒక్కో గుంత ముప్పై నుంచి యాభై అడుగుల లోతు.. 20 నుంచి 25 అడుగుల వెడల్పు లో ఉండటం విశేషం. అయితే లేటెస్ట్ గా ఆదివారం చింతకొమ్మ దిన్నె మండలంలోని గూడవాడ్ల పల్లె.. బుగ్గలపల్లెల్లో ఇలాంటివే మూడు గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఆ పల్లెలలోని జనాలు ఎందుకు ఇలా జరగుతుందో తెలియక భయపడుతున్నారు. అయితే భూమిలో సడన్ గా ఈ మార్పులు ఎందుకు వచ్చాయి? ఇంత పెద్ద ఎత్తున గోతులు పడటానికి కారణం ఏమిటి? అనేది అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే ముందుముందు ఏం జరగబోతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.