మునుగోడులో కేసీఆర్ కు ఓటమి భయం.. ఉప ఎన్నిక ఆపేందుకు యత్నం: బండి

మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  అందుకే ఏదోవిధంగా ఈ ఉప ఎన్నికను  ఆపడానికి ప్రయత్నిస్తున్నారని  ఆరోపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన ఎనిమిది గుర్తులను రద్దు చేయాలని టీఆర్‌ఎస్ వేసిన పిటిషన్‌ను రాష్ట్ర హై కోర్టు   కొట్టేయడంపై హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్  న్యాయం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని అన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యారగండ్ల పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో కేసీఆర్ ఎన్నికలను ఆపాలని కుట్ర చేస్తున్నారనీ, అందులో భాగమే ఎన్నికల గుర్తులను రద్దు చేయాలంటూ టీఆర్ఎస్ కోర్టుకు వెళ్లిందన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా చివరకు విజయం న్యాయానిదేననీ, మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం తథ్యమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీకి న్యాయస్థానంపై గౌరవం ఉందన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ రద్దు చేయమని అడుగుతున్న గుర్తులు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచీ ఉన్నాయనీ, మరి ఇన్నాళ్లూ లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేసీఆర్  ప్రజలకు సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేశారు.