అసలు బిజినెస్ చేసుకోమంటే… సైడ్ బిజినెస్సే ముద్దంటున్న మల్టీప్లెక్స్లు!

వీకెండ్ వస్తే గతంలో ఎటు వెళ్లాలా అని జనం తెగ ఆలోచించే వారు! ఒక్కొక్కరూ ఒక్కో దారి చూసుకునే వారు. కొందరు సినిమాకి, కొందరు చుట్టాల వద్దకి, కొందరు షికార్లకి వెళ్లే వారు. కానీ, ఎప్పుడైతే షాపింగ్ మాల్స్ అండ్ మల్టీప్లెక్సులు ప్రత్యక్షం అయ్యాయో జనం వారాంతాలు అక్కడే గడిచిపోతన్నాయి. చాలా మంది మల్టీప్లెక్సుల్లో సినిమాలకి విపరీతంగా అలవాటు పడిపోయారు. శనివారం, ఆదివారం సినిమాలు చూస్తూ, చిరుతిళ్లు తింటూ , షాపింగ్ చేస్తూ గడిపేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో తమ జేబులకి చిల్లులు కూడా పెట్టుకుంటున్నారు. విచిత్రంగా జనం సొమ్ము దోచేస్తున్నది సినిమా టికెట్లు కాదు. సినిమా మధ్యలో నోట్లో నమిలే చిరుతిళ్లు!

 

 

మల్టీప్లెక్సుల్లో ఓ కాఫీ, ఓ కోక్, ఓ పాప కార్న్ లేదా ఓ బర్గర్… ఇవన్నీ ఎంత రేటు వుంటాయో అందరికీ తెలిసిందే! నిజానికి బయట కంటే డబుల్ రేట్లు పలుకుతుంటాయి. కొన్ని చోట్ల మూడింతలు కూడా! కానీ, కామన్ ఇండియన్స్ వీట్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. కారణం… అంత పోష్ గా, అద్దాల మేడల్లో ప్రదర్శించే సినిమాల్లో… ఇలాంటి ఖరీదైన ఫుడ్సే వుంటాయని కన్విన్స్ అయిపోయారు. అయితే, ఎవరికో ఒకరికి మాత్రం ఒళ్లు మండకుండా వుంటుందా? అదే జరిగింది. ఓ ముంబై వాసి నేరుగా వెళ్లి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. మల్టీప్లెక్సుల్లో మామూలు క్వాలిటితోనే సర్వ్ చేయబడే ఫుడ్స్ ఎందుకు విపరీతమైన ధరకు అమ్ముతున్నారని అతడి ప్రశ్న! కోర్టు స్వీకరించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది!

 

 

ఒకవైపు కోర్టులో కేసు వుండగానే మహరాష్ట్ర అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చ జరిగింది. మొదట ఎన్సీపీ నేత మల్టీప్లెక్సుల దోపిడి అంశం లేవనెత్తినప్పటికీ తరువాత అన్ని పార్టీల వారు గొంతు కలిపారు. అందరూ ఇది అన్యాయమనే అన్నారు. అధికార బీజేపీ మంత్రి నేరుగా ఇక మీదట తమ ఇష్టానుసారం రేట్లు నిర్ణయించడం కుదరదని చెప్పేశారు! ప్రతీ ఆహారం ఎమ్మార్పీ రేటుకే అమ్మేలా రూల్ తెస్తామన్నారు. పైగా మల్టీప్లెక్సుల్లోకి ప్రేక్షకులు తమ స్వంత ఆహారం కూడా తెచ్చుకోవచ్చని ప్రకటించారు!

 

మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన వ్యవహారమంతా మనకు పైకి చిన్న విషయంగా కనిపించినా పీవీఆర్ సినిమాస్ లాంటి మల్టీప్లెక్స్ కంపెనీల షేర్లే డౌన్ అయిపోయాయి స్టాక్ మార్కెట్లో! ఎందుకంటే, మల్టీప్లెక్సుల్లో తినుబండారాలు, పానీయాల మీద రేట్లు తగ్గిపోతే దాదాపు 30-35 శాతం లాభాలు తగ్గిపోతాయట యాజమాన్యాలకి! ఇది బాహాటంగానే చెప్పేస్తున్నారు. అంటే, ఇంత కాలం మల్టీప్లెక్సుల వారు సినిమా టికెట్ల మీద కంటే ఈ కొసరు అమ్మకాల మీదే ఎక్కువ రాబట్టుకుంటున్నారన్నమాట!

 

 

బయట పదికి దొరికేది మల్టీప్లెక్స్ లో యాభై రూపాయాల కంటే ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారంటే… రెండింతలు, మూడింతలు డబ్బు ఎక్కువ చెల్లిస్తూ ఇంత కాలం ప్రేక్షకులు ఎంత నష్టపోయి వుంటారు? పైగా ఇప్పటికీ వ్యవహారమంతా మహారాష్ట్రలోనే జరుగుతుంది! హైద్రాబాద్, బెంగుళూరులోని మల్టీప్లెక్స్ ల దోపిడికి ఎప్పుడు అంతం? ఇంకా కొన్ని నెలలైనా పట్టవచ్చు! కోర్టు తీర్పు వస్తే తప్ప మహా సర్కార్ కూడా అంతిమ నియమ, నిబంధనలు నిర్ణయించలేదు. ఆ తరువాత మెల్లగా ఒక్కో రాష్ట్రం మల్టీప్లెక్సుల దోపిడీని అరికట్టాలి! అంత వరకూ సామాన్యుడు వినోదం కోసమో, బలహీనతకొద్దో ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూనే వుండాలి. చేతులకు చిలుము వదులుతూనే వుండాలి. ఇదీ పరిస్థితి!