కిర్లంపూడిలో టెన్షన్..టెన్షన్

కాపులను బీసీల్లో చేర్చడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తూ కాపు ఉద్యమనేత ముద్రగడ మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల 26 నుంచి తన నివాసం నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఈ పాదయాత్రకు ఎటువంటి అనుమతి లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ పంతం పట్టారు. దీంతో ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా 5వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.