వైసీపీ మాస్టర్ ప్లాన్....అనుకున్నదే చేశారు....

 

వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పదవి నుండి తొలగించగానే అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అనుకున్న పదవిలో విజయసాయిరెడ్డిని కూర్చోబెట్టాలి అనుకున్న ప్రభుత్వం దాని కోసం ఏకంగా ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌(లాభదాయక హోదా) కిందకు రాదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ఆర్డినెన్స్‌ జారీచేసింది.

గత నెలలోనే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఈ పోస్టులో నియమించారు. అయితే అప్పుడు ఈ పోస్టుకు ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ నుంచి మినహాయింపు లేదు. దీంతో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి ముప్పు వచ్చే అవకాశం ఉండడంతో ఆ నియామకాన్ని రద్దు చేశారు. చట్టసభల సభ్యులు ఇతర లాభదాయక పోస్టుల్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ అనే నిబంధనలు గతంలో తీసుకొచ్చారు.

మంత్రి పదవులు, స్పీకర్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లు-సభ్యులు లాంటి పదవులు శాసనసభ విధుల్లో భాగం కాబట్టి వాటిని లాభదాయకం కింద చూడొద్దని ఒక జాబితా ఖరారు చేశారు. ఏయే పోస్టులు లాభదాయకం కావో నిర్ధారించుకునే అధికారాలు రాష్ర్టాలకే ఉంటాయి. ఏపీలో 116 పోస్టులను ఇప్పటికే ఈ జాబితా నుంచి మినహాయించారు. చివరిసారిగా 2007లో టీటీడీ చైర్మన్‌, సభ్యుల పదవులను ఈ జాబితా నుండి మినహాయించారు. అదేవిధంగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు కూడా ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ నుంచి మినహాయింపునిస్తూ ‘ఆంధ్రప్రదేశ్‌ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌ అండ్‌ పెన్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్‌క్వాలిఫికేషన్స్‌(అమెండ్‌మెంట్‌) ఆర్డినెన్స్‌, 2019’ను గవర్నర్‌ నరసింహన్‌ శనివారం జారీచేశారు.

దీంతో విజయసాయిరెడ్డిని మళ్లీ నియమించుకునేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.  దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని మళ్లీ పదవి వరించింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జగన్ సర్కారు జీవో నెంబర్ 35 జారీ చేసింది. ఢిల్లీ ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ విజయసాయిరెడ్డి ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వస్తే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా గౌరవించాలని ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న ఆయనకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేసింది.