అబ్బే ఆ ఎంపీల టూర్ తో ఒరిగేదేమి లేదు.. రఘురామ రాజు  

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని కోరేందుకు కొంతమంది ఎంపీలు న్యాయ సలహాదారులతో సహా ప్రత్యేక విమానం లో ఢిల్లీకి వెళ్తున్నారు. వీరంతా రేపు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘు రామ రాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వైసిపి ఎంపీల ఈ పర్యటన పై రఘురామరాజు స్పందించారు. ఆ ఎంపీల ఢిల్లీ పర్యటనతో ఎటువంటి ప్రయోజనం ఉండదని అయన తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు తన పై జరుగుతున్న వ్యవహారమంతా జగన్ కు తెలియకుండా జరుగుతోందని భావించానని ఐతే ప్రత్యేక విమానం లో ఎంపీలను ఢిల్లీకి పంపిస్తున్నారంటే ఇదంతా జగన్ కనుసన్నలలోనే జరుగుతోందని స్పష్టమౌతోందని అయన అన్నారు. అయినా ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారిని సస్పెండ్ చేస్తే ఇక పార్లమెంట్‌లో ఎవరు మిగులుతారన్నారు. అంతే కాకుండా తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మరోసారి అయన స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి భూములు అమ్మొద్దని చెప్పానని, తర్వాత సీఎం జగన్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇసుక, పేదలందరికీ ఇల్లు పథకంలో ఉన్న తప్పులను మాత్రమే తాను ఎత్తి చూపానన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నరసాపురం ఎంపీ ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం పై ఆ లేఖలో కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో దూరదృష్టితో తీసుకున్న ఈ పరిపాలనా నిర్ణయంతో 80 కోట్ల మంది పేదలకు మేలు చేస్తుందని అలాగే ప్రధాని మోదీని దయగల మనిషిగా చరిత్ర గుర్తిస్తుందంటూ రఘురామ కృష్ణంరాజు తన లేఖలో ప్రశంసించారు.