సినిమా టిక్కెట్లు అమ్మి అడ్డంగా బుక్కైన మంత్రి

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరూ యోగా చేస్తుంటే ఒక మంత్రి కునుకు తీసి..మరో మంత్రి సెల్‌ఫోన్‌లో వీడియోలు చూసి ప్రభుత్వ పరువును మంటగలిపితే..ఇవాళ మరో మంత్రి ఏకంగా థియేటర్ ముందు టిక్కెట్లు అమ్మి అడ్డంగా బుక్కయ్యాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ట్యూబ్‌లైట్ మూవీ నిన్న విడుదలైంది. అయితే సల్లూభాయ్‌కి వీరాభిమాని అయిన మధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గోపాల్ భార్గవ్‌‌కి అభిమానం ఎక్కువైంది. అది ఎలా చూపించాలో తెలియక ట్యూబ్‌లైట్ ప్రదర్శించబడుతున్న థియేటర్ల దగ్గర టికెట్లు విక్రయించారు. సాగర్ జిల్లా గర్హకోటలో ఉన్న తన సొంత సినిమా హాళ్లోనే ఆయన ఈ పని చేశారు. దీంతో మంత్రిగారి మద్దతుదారులు ఫోటోలు తీస్తూ..వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండగా..ఓ వైపు అన్నదాతలు పంటలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్లని పరామర్శించాల్సింది పోయి ఇలా చేస్తారా అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇలాంటి పనులు చేసి పరువు పొగొట్టుకోవడం భార్గవ్‌కి కొత్తకాదు..గతంలో భర్తలు తాగి వస్తే వారిని క్రికెట్ బ్యాటులతో కొట్టాలని పిలుపునిచ్చి..నూతన వధువులకు బ్యాట్లు పంపిణీ చేశాడు.